తడిసిన పంటలను ఇలా కాపాడుకోండి
● వ్యవసాయాధికారి అలివేణి
పెద్దపల్లిరూరల్: మోంథా తుపాను ప్రభావం జిల్లాపై తీవ్రంగా చూపింది. వివిధ పంటలకు కొంత నష్టం కూడా జరిగింది. కొన్నిచోట్ల నీట మునిగాయి. మరికొన్నిచోట్ల నేలవాలాయి. వర్షం, ఈదురుగాలులతో నేలవాలిన వరి, నీటమునిగిన పత్తిని కాపాడుకునేందుకు మెలకువలు పాటించాలని మండల వ్యవసాయాధికారి అలివేణి రైతులకు సూచించారు. ఏవో సూచనలు ఇవే..
వరిలో పాటించాల్సిన జాగ్రత్తలు..
వరిపొలం మడిలో నిలిచిన వర్షపు నీటిని బయటకు పంపించాలి. కంికి వర్షపు నీటిలో తడవకుండా చూడాలి. నేలవాలిన వరిపైరును పైకి లేపి కట్టలుగా కట్టాలి. ఇలా చేస్తే గింజ రంగు మారదు. తెగుళ్లు సోకకుండా ఒక పంపునకు 30 గ్రాముల సాఫ్ లేదా స్ప్రింట్ కలిపి పిచికారీ చేయాలి. కోతకు సిద్ధంగా ఉంటే లీటరు నీటిలో 5శాతం ఉప్పు ద్రావణాన్ని కలిపి చల్లాలి. ధాన్యం తడిస్తే ఆరబెట్టాలి.
పత్తి రైతులకు..
పత్తి పూత, పిందెదశలో ఉంటే చేనులో వర్షపునీరు లేకుండా చూడాలి. మొక్కపై పత్తి బాగా ఆరిన తర్వాత తీయాలి. తడి పత్తిని ఏరవద్దు. తడిపత్తిని ఆరబెడితే బూజు పట్టిరంగు మారే అవకాశం ఉంటుంది. నాణ్యత దెబ్బతినకుండా పాలిథిన్ కవర్‌పై ఆరబెట్టాలి. కాయలు దెబ్బతినకుండా, నాణ్యతగా ఉండేందుకు ప్రొపికొనజోల్ 200 మి.లీ. మందును ఎకరాకి పిచికారీ చేయాలి. పత్తి ఆకులపై మచ్చలు కనిపిస్తే బోరాక్స్ 150గ్రాములను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.


