సమస్యల పరిష్కారమే లక్ష్యం
దారి ఆక్రమించారు
సుల్తానాబాద్ మండలం కొదురుపాక చెరువుకట్ట నుంచి పొలాలకు వెళ్లే దారిని కొందరు ఆక్రమించారు. కనీసం కాలినడకన వెళ్లకుండా అడ్డుగా బండరాళ్లు పెట్టారు. ఆ దారిని ఆక్రమించుకుంటున్నారు. ఈ విషయమై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలి.
– కొదురుపాక గ్రామ రైతులు
ఉపాధి చూపండి
కుటుంబపోషణ కష్టంగా మారింది. ఇద్దరు పిల్లలను పెంచేందుకు ఆర్థికంగా కష్టాలు పడాల్సి వస్తోంది. టెన్త్ చదివిన నాకు ఏదైనా ఉపాధి మార్గం చూపించి ఆదుకోవాలి.
– షహీదాబేగం, పెద్దపల్లి
విచారణ జరిపించండి
మా గ్రామంలోని సర్వే నంబరు 48లోగల 27 గుంటల భూమిని కొందరు ఆక్రమించుకున్నారు. ఈ వ్యవహారంపై తగిన విచారణ జరిపించి మాకు న్యాయం చేయాలి.
– ప్రతాప్, గుండారం, కమాన్‌పూర్ మండలం
● అర్జీలను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలి
● అధికారులకు కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశం
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజలు ప్రజావాణి ద్వారా అందించిన అర్జీలపై ప్రత్యేక దృష్టిసారించి సత్వర పరిష్కార మార్గాన్ని చూపాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అడిషనల్ కలెక్టర్ వేణుతో కలిసి అభాగ్యుల నుంచి అర్జీలు స్వీకరించారు. వాటిని పరిశీలించి వివిధ విభాగాల అధికారులకు సిఫారసు చేశారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని ఆయన ఆదేశించారు.


