ఆయనతో వేగలేం.. | - | Sakshi
Sakshi News home page

ఆయనతో వేగలేం..

Jun 20 2026 11:13 AM | Updated on Jun 20 2026 11:13 AM

పని ఎంతైనా చేస్తాం.. బూతులు మాత్రం పడలేం బూతులు తిట్టి గెంటేశారు...

గత 20 ఏళ్లుగా ఉపాధి హామీలో కష్ట నష్టాలకు ఓర్చి పనిచేస్తున్నాం. ఇన్నేళ్లలో మాకు ఎలాంటి ఎదుగుదలా లేదు. నాలుగేళ్లుగా కనీసం సెలవులు లేకుండా, బంధువుల చావులకు కూడా వెళ్లనివ్వకుండా మానసికంగా హింసిస్తున్నారు. వ్యవస్థలో తప్పులు చేసేవారిని వెనకేసుకొస్తూ.. నిజాయితీగా పనిచేసే మమ్మల్ని వేధిస్తున్నారు. పని ఎంతైనా చేస్తాం కానీ, అధికారులం కదా అని కిందిస్థాయి సిబ్బందిని అందరి ముందు బూతులు తిడితే మాత్రం భరించేది లేదు. జిల్లా పరువు పోకూడదని ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నాం. ఏపీఓ, ఎంపీడీఓలను అసభ్య పదజాలంతో దూషించాక భరించే హద్దులు దాటిపోయాయి. ఇక ఈ బెదిరింపుల పాలనను ఎంతమాత్రం సహించబోం.

– శ్రీనివాసరావు, ఏపీఓ

ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో పెదపెంకి గ్రామ అభివృద్ధి కోసం గత మూడు నెలలుగా రేయింబవళ్లు కష్టపడుతున్నాం. అక్కడ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ సస్పెండ్‌ కావడంతో, ఆ బాధ్యతలు కూడా నేనే తీసుకుని 3 వేల మంది కూలీలతో పనులు చేయిస్తున్నాను. రాత్రికి రాత్రే 50 మ్యాజిక్‌ డ్రైన్లు వేయించడంతో పాటు, జేజేఎం పనులు కూడా వేగంగా చేస్తున్నాం. అంత కష్టపడుతున్నా.. కేవలం ఐదు నిమిషాలు సప్లై ఆర్డర్‌/మస్టర్‌ ఇవ్వడం ఆలస్యమైందని నన్ను ఏకంగా సస్పెండ్‌ చేస్తూ ఆర్డర్‌ ఇచ్చారు. కారణం చెబుదామంటే వినిపించుకోకుండా ’నువ్వు పనికిరావు, మిమ్మల్ని టెర్మినేట్‌ చేయాలి.. వెధవ నా కొడుకులు..’ అంటూ అత్యంత అసభ్య పదజాలంతో దూషించి బయటకు తరిమేశారు. ఈ పనుల ఒత్తిడిలో ఇన్నాళ్లూ ఆ మాటలు భరిస్తూ పనిచేశాం.. కానీ నిన్నటి అవమానంతో మా ఓపిక నశించింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి, కమిషనర్‌, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి.

– తిరుపతిరావు, టెక్నికల్‌ అసిస్టెంట్‌

పార్వతీపురం రూరల్‌: డ్వామా పీడీ వేధింపులతో ఉపాధి హామీ పథకం ఉద్యోగులు, ఎంపీడీఓ కన్నీరుపెట్టారు. ఆయన ఉంటే ఉద్యోగాలు చేయలేమంటూ ఆందోళనకు దిగారు. ఆయన అవినీతి కాంక్షను తీర్చడం మా వల్ల కాదంటూ తేల్చిచెప్పారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి తోటి ఉద్యోగులను సముదాయించాల్సిన ఉన్నతాధికారి.. నిలువెల్లా ‘అధికార’ దర్పంతో, బూతుల పురాణంతో వీరంగం సృష్టించడం, బూతు పురాణం వినిపించడంపై ఆవేదన వ్యక్తంచేశారు. బలిజపేట మండల పరిషత్‌ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం డ్వామా పీడీ (ప్రాజెక్టు డైరెక్టర్‌) రామచంద్రరావు ప్రవర్తించిన తీరు, వాడిన పదజాలంతో మానసిక క్షోభకు లోనయ్యారు. ఆయన ప్రవర్తనకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాధి హామీ ఉద్యోగులంతా ఏకతాటిపైకి వచ్చి కలెక్టరేట్‌ వద్ద శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పీడీకి వ్యతిరేకంగా నినదించారు. ఆయనను తక్షణమే బాధ్యతల నుంచి తొలగించకుంటే ఉద్యోగాలు చేసేది లేదంటూ తెగేసి చెప్పారు.

జాబ్‌కార్డుల చాటున.. ‘కోట్ల’ దందా!

జిల్లా వ్యాప్తంగా దాదాపు 3.34 లక్షల ఉపాధి హామీ జాబ్‌కార్డులు ఉన్నాయి. ఉపాధిహామీ ఉద్యోగులు కొందరు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ ఉపాధిహామీ పనుల్లో చిలక్కొట్టుడుకు పాల్పడుతున్నారు. వేతనదారుల నుంచి వారంవారం అక్రమ వసూళ్లు చేస్తున్నారు. వాటిని ఉన్నతాధికారికి చేరవేస్తున్నట్టు సమాచారం. డబ్బులు చేతికి అందని చోట.. ఆ ఉన్నతాధికారి ఉద్యోగులపై విరుచుకుపడుతున్నట్టు సమాచారం. ఉపాధి హామీ వేతనదారుల రెక్కల కష్టాన్ని పిండుకుంటూ సాగుతున్న ‘కోట్ల’ దందా వెనుక ఎవరి హస్తం ఉందనే కోణంలో సమగ్ర విచారణ జరపాలన్న డిమాండ్‌ జనం నుంచి వినిపిస్తోంది.

డ్వామా పీడీ తీరుపై ఉపాధి హామీ సిబ్బంది తిరుగుబాటు

కార్యాలయంలోనే ఏపీఓ, ఎంపీడీఓలపై పీడీ దుర్భాషలు..

కుర్చీలు తంతూ వీరంగం..

కన్నీరు పెట్టిన ఎంపీడీఓ

కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగుల భారీ నిరసన.. వినతిపత్రం సమర్పణ

ఆయన అవినీతి కాంక్షను తీర్చలేమంటూ ఆవేదన

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement