నోటీసులకు నోట్ల కట్టలు..! | - | Sakshi
Sakshi News home page

నోటీసులకు నోట్ల కట్టలు..!

Jun 20 2026 11:13 AM | Updated on Jun 20 2026 11:13 AM

నోటీసులకు నోట్ల కట్టలు..!

ఆక్రమణలంటూ గగ్గోలు పెడతారు... అధికారులు నోటీసులిచ్చేలా ఒత్తిడి చేస్తారు. నోటీలందుకున్నవారిని నుంచి నోట్లకట్టలు దండుకున్నాక... అవి ఆక్రమణలు కాదు.. సక్రమమే అంటూ సర్దిచెప్తారు. పార్వతీపురంలో ‘అధికారం’ అండతో సాగుతున్న నయాదందాను చూసి పేదలు బెంబేలెత్తిపోతున్నారు. పట్టాదారుల నుంచి డబ్బులు దండుకున్న తీరును చూసి నివ్వెరపోతున్నారు. మరో మూడేళ్లు ఎలా గడుస్తాయా అని బిత్తరచూపులు చూస్తున్నారు.

సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం పురపాలక సంఘం పరిధిలో చెరువులు, కాలువల స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని.. ఆక్రమణల బారి నుంచి వాటిని రక్షించాలని స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయ్‌చంద్ర పదేపదే గగ్గోలు పెడుతున్నారు. ఇదే సమయంలో ఆక్రమణలపై దృష్టి సారించిన అధికారులు.. వారికి నోటీసులు జారీ చేస్తుంటే, అధికార పార్టీకి చెందిన వారే అడ్డుకుంటున్నారు. ఉసుగొల్పుతున్నది వారే.. అడ్డుకుంటున్నదీ వారే.. ఇలా అయితే ఎలా ముందుకు వెళ్లగలమని మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

పెద్దవారిని వదిలి.. చిన్న వారిపై పంతమా?

చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణపై కదిలిన అధికార యంత్రాంగం.. వందల సంఖ్యలో ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసింది. పార్వతీపురం పట్టణంలోని వరహాల గెడ్డలో సర్వే నంబర్‌ 351, నెల్లి చెరువులో సర్వే నంబర్‌ 401, సర్వే నంబర్‌ 343లో దేవుని బంద చెరువు స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు జరిపారని దశలవారీగా పలువురికి నోటీసులు అందిస్తున్నారు. నోటీసు అందుకున్న మూడు రోజుల్లోగా వీటిని స్వచ్ఛందంగా తొలగించాలని, లేకుంటే తామే చర్యలు చేపడతామని మున్సిపల్‌ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఒక్క దేవునిబంద వద్దే 24 మంది నిర్మాణదారులను గుర్తించి నోటీసులు అందజేశారు. వారు స్పందించకపోవడంతో శుక్రవారం జేసీబీ సాయంతో తొలగించేందుకు వెళ్లారు. దీంతో స్థానికులు అడ్డుకున్నారు. వాస్తవానికి ఇక్కడ నివసిస్తున్న వారిలో అధిక శాతం మంది పేదలే. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలోనే వీరికి పట్టాలు అందజేశారు. అధికారులే ఇళ్లు నిర్మించి, రోడ్లు వేసి.. తాగునీరు, ఇతర వసతులు కల్పించారు. ఇప్పుడు అవే స్థలంలో ఆక్రమణలు అంటూ మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు హడావిడి చేయడంపై పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో పేరు మోసిన వ్యక్తులు, బడాబాబులు రూ.కోట్ల విలువైన స్థలాలను కబ్జా చేస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకోకుండా, తమపైనే ఎందుకని వాపోతున్నారు.

నోటీసులిస్తే.. బేరం కుదిరినట్లే!

లక్షలాది రూపాయలు వెచ్చించి పేదలు, మధ్య తరగతి ప్రజలు పలు ప్రభుత్వ స్థలాల్లో తెలిసో, తెలియకో ఇళ్లను కొనుగోలు చేసుకున్నారు. కొందరు స్థలాలను తీసుకొని నిర్మించుకున్నారు. కొన్నేళ్లుగా ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని జీవిస్తున్నారు. ఇప్పుడు ఆక్రమణల పేరిట అధికార పార్టీ నాయకులు హడావిడి చేయడం.. అధికారులు నోటీసులు ఇవ్వడం నియోజకవర్గంలో పరిపాటిగా మారింది. నోటీసులు అందుకున్న పేదలు.. తమ నివాస స్థలాలు పోతాయేమో అన్న భయంతో అధికార పార్టీకి చెందిన నాయకులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా వారు ఒక్కొక్కరి వద్ద రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో పట్టణంలోని వరహాల గెడ్డ సర్వే నంబర్‌ 351లో 24 మంది నిర్మాణదారులకు ఆక్రమణల పేరిట నోటీసులు జారీ చేశారు. స్థానిక నాయకులు బేరం కుదుర్చుకొని.. వారి వద్ద రూ.లక్షలు కాజేసి, తర్వాత విషయాన్ని మరుగున పరిచారు. ఇప్పుడు దేవుని బంద వద్ద కూడా అధికార పార్టీ నాయకులు అదే డ్రామాను అవలంబిస్తున్నారని ప్రజాసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఒకవైపు వారి ఎమ్మెల్యే.. ఆక్రమణలు తొలగించాలని చెబుతుంటే, అదే పార్టీకి చెందినవారు దేవునిబంద వద్దకు వచ్చి, పేదల పక్షాన ఉన్నట్లుగా హడావిడి చేయడం గమనార్హం. ఆక్రమణల విషయంలో పేదలు ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని.. అదే సమయంలో ప్రభుత్వ స్థలాలు, బందలను ఎవరు ఆక్రమించినా రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకోవాలని ఇటీవల జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారు. ఇప్పుడు ఈ స్థలాల విషయంలో అధికారులు, అధికార పార్టీ నాయకులు ఏం చేస్తారో చూడాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement