విజయనగరం అర్బన్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన్ (పీఎం–వీబీఆర్‌వై)తో యువతకు ఉపాధి అవకాశాలు, సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యమని ప్రాంతీయ ఈపీఎఫ్‌ఓ కమిషనర్ కణితి అవినాష్‌కుమార్ అన్నారు. విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా రూ.2,400 కోట్ల ప్రోత్సాహకాలను డీబీటీ విధానంలో విడుదల చేసిన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం రీజియన్‌లో పీఎం–వీబీఆర్‌వై కింద 705 రిజస్ట్రేషన్‌లు నమోదయ్యాయన్నారు. తొలుతగా 2,073 మంది ఉద్యోగార్థులు, 474 మంది మహిళలకు పార్ట్–ఏ కింద రూ.61.12 లక్షలు, పార్ట్–బి కింద రూ.10.66 కోట్ల ప్రోత్సాహకాలు మంజూరైనట్లు వెల్లడించారు. సంఘటిత రంగంలో తొలిసారి ఉద్యోగాల్లో చేరి నెలకు రూ.1 లక్షలోపు వేతనం పొందే యువతకు గరిష్టంగా రూ.15 వేల వరకు ఆర్థిక ప్రోత్సాహకం అందజేస్తామన్నారు. కొత్త ఉద్యోగాలు కల్పించే సంస్థలకు ప్రతి ఉద్యోగిపై నెలకు రూ.3 వేల వరకు ప్రోత్సాహకాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమ శాఖ జనరల్ మేనేజర్ ఎం.వి.కరుణాకర్, జిల్లా కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎస్.డి.వి.ప్రసాదరావు, సహాయ కమిషనర్లు జి.ఎల్లాజీరావు, ఇన్సెపెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సుధాకర్, లేబర్ ఎన్‌ఫోర్సుమెంట్ ఆఫీసర్ రుబల్ సింగ్, ఈఎస్‌ఐసీ జాయింట్ డిప్యూటీ డైరెక్టర్ సోమేంధ్రకుమార్ సాహూ పాల్గొన్నారు.


