పచ్చదనంపై గొడ్డలి పోటు..! | - | Sakshi
Sakshi News home page

పచ్చదనంపై గొడ్డలి పోటు..!

Jun 20 2026 11:13 AM | Updated on Jun 20 2026 11:13 AM

పచ్చదనంపై గొడ్డలి పోటు..!

ఇళ్ల ప్లాట్ల కోసం ప్రకృతి విధ్వంసం..

ప్లాస్టిక్‌ వాడకంతో శ్మశానంగా

మారుతున్న భూమాత

చెట్లను నరకడం వల్లే

పిడుగుల తీవ్రత

గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పొడవాటి తాటి, రావి చెట్లు సహజసిద్ధమైన లైట్నింగ్‌ అరస్టర్లుగా పనిచేస్తాయి. లేఅవుట్లు, భవనాల కోసం వాటిని విచక్షణారహితంగా నరికేయడం వల్లే పిడుగులు నేరుగా మనుషులపై పడుతున్నాయి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. చెట్లను అక్రమంగా నరికితే కఠిన చర్యలు తీసుకుంటాం.

– బి.రామ్‌ నరేష్‌, జిల్లా ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి, విజయనగరం

పర్యావరణాన్ని కాపాడుకోకపోతే మనుగడ కష్టం

ప్లాస్టిక్‌ వ్యర్థాలు, వాహన కాలుష్యం వల్ల గాలిలో విషవాయువులు విపరీతంగా పెరిగిపోయి హరితగృహ ప్రభావం ఏర్పడుతోంది. దీనివల్లే అసాధారణ ఎండలు, అకాల వర్షాలు, పిడుగుపాట్లు సంభవిస్తున్నాయి. ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నియంత్రించకపోతే మానవ మనుగడకే వాటిల్లుతుంది. – పి.వీ.ఎస్‌.రామకృష్ణ,

పర్యావరణ నిపుణుడు

విజయనగరం గంటస్తంభం: ప్రకృతి ఒడిలో బతికినంత కాలం మనిషికి ఎలాంటి లోటూ లేదు. కానీ, ఎప్పుడైతే మనిషికి స్వార్థం ముదిరి తనను సాకుతున్న ప్రకృతి గుండెలపైనే గొడ్డలితో వేటు వేయడం మొదలుపెట్టాడు. అభివృద్ధి, ఆధునికత, లేఅవుట్లు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాల పేరిట..ప్రాణవాయువునిచ్చే పచ్చటి మహావృక్షాలను నిలువునా నరికేస్తున్నాడు. భూమిని కాంక్రీట్‌ అడవిగా మారుస్తూ మనిషి చేస్తున్న ఈ దారుణ ద్రోహానికి..ప్రకృతి ఇప్పుడు ఎదురుదాడి చేస్తోంది. ఆ ఆక్రోశమే..నేడు అకాల వర్షాలు, భానుడి అసాధారణ భగభగలు, ఆకాశం నుంచి పడుతున్న నిప్పుల పిడుగులు, ఇటీవల మే, జూన్‌ నెలల్లో విజయనగరం జిల్లా పరిధిలో సంభవించిన ప్రాణ నష్టాలే ఇందుకు సజీవ సాక్ష్యాలు.

నాడు చెట్లు పిడుగులను మోశాయి..

నేడు నేరుగా మనుషుల మీదే

పాత రోజుల్లో ఎంత పెద్ద వాన పడినా, ఉరుములు ఉరిమినా మనుషులపై నేరుగా పిడుగులు పడి చనిపోయిన సంఘటనలు చాలా అరుదుగా ఉండేవి. దానికి కారణం నాటి కాలంలో ప్రతి ఊరి పొలిమేరల్లో, చెరువు గట్లపై, పొలాల గట్లపై ఆకాశాన్ని తాకేలా పెద్ద పెద్ద తాటి చెట్లు, రావి చెట్లు, వేప చెట్లు, మర్రి చెట్లు ఉండేవి. ఆకాశంలో మేఘాల ఘర్షణ వల్ల పుట్టే ఘోరమైన విద్యుదాఘాతాన్ని(పిడుగును) ఆ ఎత్తైన వృక్షాలు తమ గుండెలపైకి లాక్కునేవి అలా లాక్కుని, ఒక ఎర్త్‌లా పనిచేసి ఆ ప్రమాదకర విద్యుత్‌ను భూమిలోకి పంపేసేవి. తమ ప్రాణాలను పణంగా పెట్టి మనుఘలను, పశువులను కాపాడేవి. కానీ ఈ రోజు? భూముల వ్యాపారం కోసం, కోట్ల రూపాయల లాభాల కోసం ఆ ఎత్తైన చెట్లన్నింటినీ నరికేశారు. రోడ్ల విస్తరణ కోసం, లేఅవుట్ల కోసం వందల ఏళ్ల నాటి వృక్షాలను నేలకూల్చారు. ఇప్పుడు ఆకాశానికి, భూమికి మధ్య రక్షణగా నిలిచే అడ్డుగోడలే లేవు. ఫలితంగా, ఆకాశం నుంచి పడే పిడుగులు అడ్డులేకుండా..పొలాల్లో కష్టపడే అమాయక రైతులపై, రెక్కాడితే గానీ డొక్కాడని పేద కూలీలపై, మైదానాల్లో ఆడుకునే పసిపిల్లలపై నేరుగా పడి క్షణాల వ్యవధిలో వారి ప్రాణాలను బూడిద చేస్తున్నాయి. నోరులేని పశువులు, గొర్రెలు, మేకలు కూడా ఈ పిడుగుల ధాటికి మాడిపోతున్నాయి.

ఇప్పటికై నా మేల్కొని చెట్లను నాటుదాం

ఒకప్పుడు ప్లాస్టిక్‌ వాడకం తక్కువగా ఉండడం వల్ల భూమి పచ్చగా, స్వచ్ఛంగా ఉండేది. కానీ నేడు ఏ వస్తువు కొన్నా ప్లాస్టిక్కే. భూమిలో కలవడం అసాధ్యమైన ఈ ప్లాస్టిక్‌ వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకడం లేదు. మరోవైపు అడ్డగోలుగా పెరుగుతున్న వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి కార్బన్‌మోనాకై ్సడ్‌, కార్బన్‌డయాకై ్సడ్‌ వంటి వ్యర్థ వాయువులు విపరీతంగా రిలీజ్‌ అవుతున్నాయి. చెట్లే ఉంటే ఆ పొల్యుషన్‌ను పీల్చుకుని స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను విడిచిపెట్టేవి. కానీ చెట్లను నరికేయడం వల్ల గాలి మొత్తం విషపూరితమైపోయింది. ఇదే నిర్లక్ష్యం కొనసాగితే మనిషి వీపున ఆక్సిజన్‌ సిలిండర్లు పెట్టుకుని తిరిగే దౌర్భాగ్య పరిస్థితి వస్తుంది. అభివృద్ధి చెందినప్పుడు ప్రకృతిని ఎంత విధ్వంసం చేస్తున్నామో, అంత ప్రకృతిని తిరిగి సృష్టించగలిగితేనే పర్యావరణాన్ని సమతుల్యం చేయగలం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement