పశువుల లారీ సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

పశువుల లారీ సీజ్‌

Jun 20 2026 11:13 AM | Updated on Jun 20 2026 11:13 AM

దత్తిరాజేరు: ఎలాంటి నుమతులు లేకుండా 40 పశువులను కుక్కి తరలిస్తున్న లారీని శుక్రవారం పట్టుకున్నట్లు పెదమానాపురం ఎస్సై కళాధర్‌ తెలిపారు.పశువులు అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం అందడంతో సిబ్బందితో కలిసి స్టేషన్‌ సమీపంలో లారీ నిలిపి పరిశీలించగా అందులో కొన ప్రాణంతో ఉన్న 40 పశువులను గుర్తించి పట్టుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు పశువుల యజమానిపై కేసు నమోదు చేసి లారీని సీజ్‌ చేశామన్నారు.

వ్యక్తి ఆత్మహత్య

గజపతినగరం రూరల్‌ : మండలంలోని మధుపాడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఒంటరితనం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన ఈ సంఘటనపై పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అవివాహితుడు కలిగిట్ల సురేంద్ర తల్లిదండ్రులు కొద్దికాలం క్రితం మరణించగా, అక్కాచెల్లెళ్లు ఇద్దరు వివాహాలు చేసుకుని అత్తవారింటికి వెళ్లిపోవడంతో సురేంద్ర గ్రామంలోని తన ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. రోజువారీ కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ ఒంటరితనాన్ని భరించలేక శుక్రవారం తెల్లవారుజామున తన ఇంటిలోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం సురేంద్ర ఎంతకీ తలుపులు తీయకపోవడంతో పక్కింట్లో ఉంటున్న బంధువు శ్రీనివాస్‌కు అనుమానం వచ్చి చూడగా బెడ్‌ షీట్‌ తో ఉరివేసుకుని ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే సురేంద్రను కిందకు దించగా అప్పటికే మృతిచెంది ఉన్నాడు. వెంటనే విశాఖపట్నంలో ఉంటున్న అక్క రజినికి సమాచారం చేరవేశారు. అక్క రజిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు గజపతినగరం ఎస్సై కె.కిరణ్‌ కుమార్‌ నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పదో తరగతి అడ్వాన్స్‌డ్‌

సప్లిమెంటరీ ఫలితాల విడుదల

విజయనగరం అర్బన్‌: జిల్లాలో నిర్వహించిన 10వ తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు, ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యా పీఠం 10వ తరగతి, ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ మేరకు డీఈఓ యూ.మాణిక్యం నాయుడు ఫలితాలను ప్రకటించారు. జిల్లాకు సంబంఽధించిన ఫలితాల వివరాలు, రీ–కౌంటింగ్‌, రీ–వెరిఫికేషన్‌ మార్గదర్శకాలను డీఈఓ తెలియజేశారు. పరీక్షకు హాజరైన 2,113 మందిలో 86.80 శాతంతో 1,834 మంది ఉత్తీర్ణులు కాగా వారిలో హాజరైన 1,209 మంది బాలురలో 84.95 శాతంతో 1,027 మంది, 904 మంది బాలికల్లో 89.27 శాతంతో 807 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు.

రీ–కౌంటింగ్‌, రీ–వెరిఫికేషన్‌ వివరాలు:

ఫలితాలపై అసంతృప్తి ఉన్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ ‘బీఎస్‌ఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్‌’ ద్వారా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు స్వీకరిస్తారు. రీ–కౌంటింగ్‌ ఫీజు సబ్జెక్టుకు రూ.500, రీ–వెరిఫికేషన్‌ ఫీజు సబ్జెక్టుకు రూ.వెయ్యిగా ప్రకటించారు.

సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్‌ స్కూల్‌)

ఫలితాలు

ఆంధ్రప్రదేశ్‌ స్వారత్రిక విద్యాపీఠం మే–2026 నిర్వహించిన సప్లిమెంటరీ ఫలితాలలో జిల్లా విద్యార్ధులు మంచి ప్రతిభ కనపరిచారు. ఓపెన్‌ టెన్త్‌ ఫలితాలలో జిల్లా రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలవగా ఓపెన్‌ ఇంటర్‌ ఫలితాలలో 18వ స్థానంలో నిలిచింది. ఓపెన్‌ టెన్త్‌ పరీక్షకు హాజరైన 370 మందిలో 90 శాతంతో 333 మంది ఉత్తీర్ణులయ్యారు. ఓపెన్‌ ఇంటర్‌ పరీక్షకు హాజరైన 620 మందిలో 410 మంది పాసయ్యారు. ఫలితాలను వెంటనే విద్యార్థులకు తెలియజేయాలని ప్రధానోపాధ్యాయులను, ఓపెన్‌ స్కూల్‌ ఏఐ కోఆర్డినేటర్లను డీఈఓ ఆదేశించారు. మార్కుల జాబితాలను మరో నాలుగు రోజుల్లో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement