చిన్నారుల కోసం గణిత యంత్రం | - | Sakshi
Sakshi News home page

చిన్నారుల కోసం గణిత యంత్రం

Jun 20 2026 11:13 AM | Updated on Jun 20 2026 11:13 AM

చిన్నారుల కోసం గణిత యంత్రం

రాజాం: సంతకవిటి మండలం శంకరునిఅగ్రహారం(శంకరపేట) గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు యడ్ల జనార్దననాయుడు తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. గత 18 ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో సెకండరీగ్రేడ్‌ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆయన ప్రస్తుతం శ్రీకాళహస్తిలో విధులు నిర్వహిస్తున్నారు. ఏడాదికాలంగా ఎంతో శ్రమించి మేథమెటిక్‌ మిషన్‌ను కనిపెట్టారు. ఒకటి నుంచి 5వ తరగతి విద్యార్థులకు సులభంగా గణిత పాఠాలు బోధించేందుకు ఈ మిషన్‌ ఉపయోగపడుతోంది. ఎటువంటి క్లిష్ట సమస్యనైనా సులువుగా ఈ మిషన్‌ ద్వారా పరిష్కరించవచ్చు. విద్యార్థులకు నేరుగా ప్రత్యక్ష పద్ధతిలో లెక్కలు బోధించేందుకు ఉపయోగపడే ఈ మిషన్‌ ప్రపంచంలోనే తొలి మిషన్‌గా ఆ ఉపాధ్యాయుడు వివరాలు వెల్లడించారు. తాను తయారుచేసిన ఈ మిషన్‌కు గణితంలో 108 కాన్సెప్ట్‌లు బోధించవచ్చని వివరించారు. విద్యార్థులకు కాన్సెప్ట్‌లెర్నింగ్‌, సెల్ఫ్‌ లెర్నింగ్‌, ఎక్సర్‌సైజ్‌ అండ్‌ ఎవల్యూషన్‌కు ఈ మిషన్‌ ఉపయోగపడుతోందన్నారు. ఈ మిషన్‌కోసం కష్టపడి పేటెంట్‌ హక్కులు తీసుకున్న ఆయన ప్రపంచంలోనే తొలి గణిత రీసెర్చ్‌ మిషన్‌ అని వివరించారు.

విజయనగరం టు అమరావతి

జనార్దనరావు మాష్టరు గత విద్యాసంవత్సరంలో వ్యక్తిగత కారణాలతో అంతర్‌ జిల్లాల బదిలీలో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి డివిజన్‌ పరిధిలో వరదయ్యపాలెం మండలం నాగనందాపురం ప్రభుత్వ పాఠశాలకు బదిలీపై వెళ్లారు. అంతకుముందు సంతకవిటి మండలంలో చిత్తారిపురం, ఇజ్జిపేట, సంతకవిటి, బూరాడపేట పాఠశాలల్లోనూ, వంగర మండలం కొప్పరకొత్తవలస పాఠశాలల్లో పనిచేశారు. ఆయన తయారీచేసిన మిషన్‌ తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారులు తెలుసుకుని ఏపీ విద్యాశాఖ సెంట్రల్‌ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. దీంతో విద్యాశాఖ కమిషనర్‌ తమీమ్‌ అన్సారియా జనార్దనరావును అమరావతి పిలిపించి శుక్రవారం అక్కడి విద్యాభవన్‌లో మిషన్‌ వినియోగంపై ఆరాతీశారు. పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌తో పాటు ప్రాక్టికల్‌గా తరగతి గదిలో ఎలా పాఠాలు బోధించవచ్చో, గణిత లెక్కలు, క్లిష్ట సమస్యల పరిష్కారాన్ని చిన్నారులకు అర్థమయ్యే రీతిలో టీఎల్‌ఎం మాదిరి ఎలా బోధించవచ్చో వివరించారు. ఈ మిషన్‌ పనితీరు అద్భుతమని కమిషనర్‌ కితాబిచ్చినట్లు జనార్దననాయుడు మాస్టారు తెలిపారు. ఈ మిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి, అన్ని పాఠశాలలకు ఈ మిషన్‌ వినియోగంపై చర్చిస్తామని, భవిష్యత్తులో ఇదొక కంప్యూటర్‌ పరికరం మాదిరిగా ప్రతి పాఠశాలలో ఉపయోగపడుతుందని వెల్లడించినట్లు జనార్దనరావు అన్నారు. ఈ సందర్భంగా జనార్దనరావును పలువురు అభినందించారు.

మేథ్‌మెటిక్‌ మిషన్‌ కనిపెట్టిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు

ఏపీ విద్యాభవన్‌లో ప్రెజెంటేషన్‌

మిషన్‌ వినియోగంలోకి తెచ్చేయోచనలో విద్యాశాఖ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement