మక్కువ:
ఆటో భాగస్వామ్యం సర్వీస్ నగదు లావాదేవీలపై జరిగిన గొడవ కారణంగా ఓ యువకుడు హత్య కు గురయ్యాడు. పార్వతీపురం మన్యం జిల్లా, మక్కువ మండలం కొండబుచ్చమ్మపేట గ్రామంలో జరిగిన ఈ హత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కొండబుచ్చమ్మపేట గ్రామానికి చెందిన మరడ శ్రీనివాసరావు(27) ఆటోను, అదే గ్రామంలో నివాసముంటున్న దత్తి అచ్యుతరావు ఆదాయ భాగస్వామ్యం పద్ధతిలో నడుపుతున్నాడు. ఆటో సర్వీస్ ద్వారా వచ్చిన నగదు లావాదేవీల పై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈనెల 12వ తేదీన ఆటో ఓనర్ శ్రీనివాసరావు, తన భాగస్వామ్యుడైన అచ్యుతరావును ఇంటికి రమ్మనగా, ఇద్దరూ ఇంటి మేడపైకి వెళ్లి మాట్లాడుకుంటుండగా, గొడవ తలెత్తింది. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావును, అచ్యుతరావు ప్రహరీకి వాటర్ ట్యాంకుకు గుద్దించి, రెండు చేతులతో గొంతు నొక్కి శ్రీనివాసరావును హత్య చేశాడు. 13వ తేదీన తెల్లవారు జామున మేడపై శ్రీనివాసరావు విగతజీవిలా పడి ఉండడాన్ని కుటుంబసభ్యులు గుర్తించారు. శ్రీనివాసరావు గుండెపోటు, మద్యం అధికంగా తాగడం వల్ల మృతి చెందినట్లు కుటుంబ సభ్యులను, గ్రామస్తులను నిందితుడు అచ్యుతురావు నమ్మించాడు. అంతేకాకుండా శ్రీనివాసరావు అంత్యక్రియల్లో కూడా చురుగ్గా పాల్గొన్నాడు. శ్రీనివాసరావు ముఖంపై గాయాలు గుర్తించిన కుటుంబసభ్యులు గ్రామస్తులు, అచ్యుతరావును నిలదీయగా గ్రామం నుంచి పరారయ్యాడు. మృతుడు శ్రీనివాసరావు అన్నయ్య మరడ వెంకటేష్ ఈనెల 16వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తుండగా, అదే గ్రామానికి చెందిన గ్రామ పెద్ద ధనంజయరావు ద్వారా, నిందితుడు అచ్యుతరావు నేరం అంగీకరించి పోలీసులకు లొంగిపోయాడు. నిందితుడు అచ్యుతరావు వాంగ్మూలాన్ని రెవెన్యూ అధికారుల సమక్షంలో పోలీసులు సేకరించారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్సై వెంకటరమణ శుక్రవారం తెలిపారు.
నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు


