● రెండేళ్లుగా జంఝావతి సాగునీరందక రైతుల ఆందోళన
కొమరాడ: మండలంలోని రాజ్యలక్ష్మీపురం గ్రామం వద్ద జంఝావతి నదిపై 1976లో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టగా ఒడిశాతో ఏర్పడిన చిక్కుముడితో ఆ నిర్మాణం కాస్తా అసంపూర్ణంగా అగిపోయింది. ఎన్నో ప్రభుత్వాలు మారినా కనీసం పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఈ నేపథ్యంలో దివంగత నేత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి పుణ్యమా అని 2006లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో జంఝావతిపై రబ్బర్ డ్యాం ఏర్పాటు చేసి లోలెవెల్ కెనాల్ ద్వారా 12 వేల ఎకరాలకు సాగు నీరు అందించారు అప్పట్లో కుడికాలువకు ఎత్తి పోతల పథకం ఏర్పాటు చేసి దాని ద్వారా రాజ్యలక్ష్మీపురం, కుమ్మరిగుంట, కందివలస, కంబవలస, కోనవలస తదితర గ్రామాల రైతులకు సుమారు 800 ఎకరాలకు సాగునీరు కోసం మోటార్లు అమర్చి సాగు నీరు అందించే వారు అయితే గడిచిన రెండేళ్లుగా ఎత్తి పోతల పథకం ద్వారా సాగునీరు అందక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఎండలు త్రీవంగా ఉండడంతో ఎత్తిపోతల పథకం ద్వారా నీరు రాకపోతే సుమారు 800 ఎకరాల్లో పంటనష్ట పోయే ఆస్కారం ఉంది. ఇప్పటికే అధికారులకు ఎంతలా మొరపెట్టుకున్నప్పటికీ కనీసం పట్టించుకోవడం లేదని ఈ ప్రాంత రైతులు వాపోతున్నారు. జంఝావతి రిజ్వయర్‌పై ఉన్న ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందిస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్న తమకు గడిచిన రెండేళ్లుగా నిరాశే ఎదురవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జంఝావతి ఎత్తిపోతల పథకం త్రీవ నిర్లక్ష్యానికి గురైందని ప్రతి ఏడాది సాగు సీజన్ ప్రారంభమైనప్పడల్లా సాగునీరు కోసం ఎదురుచూడవలసిన పరిస్థితి ఏర్పడిందని రైతులు చెబుతున్నారు. ఆ పథకం నిర్వహణ, మరమ్మతులు, విద్యుత్ సరఫరా వంటి ఆంశాల్లో అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల సాగునీరు రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికై నా జంఝావతి అధికారులు నిర్లక్ష్యం వీడి రైతులకు సాగునీరు అందివ్వాలని కోరుతున్నారు. గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ నాయకులు ఎత్తిపోతల పథకం ద్వారా సాగు నీరందించేలా చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
జంఝావతి నదిపై నిర్మాణం చేసిన రిజర్వాయర్‌ను ఎన్నో ప్రభుత్వాలు గాలికి వదిలేస్తే మహానేత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి పుణ్యామా అని రబ్బర్ డ్యాం నిర్మాణం చేసి ఈ ప్రాంత రైతులకు మేలు చేశారు. ప్రతి ఏడాదీ సాగునీరు పుష్కలంగా అందించేవారు. జంఝావతి అధికారుల నిర్లక్ష్యంతో గత రెండేళ్లుగా ఎత్తిపోతల పథకం నిర్వహణ గాలికి వదలేశారు. అధికారుల నిర్లక్ష్యంతోనే సాగునీరు అందించకపోతున్నారు. దీని వల్ల మా ప్రాంత రైతులు సాగునీరు అందక త్రీవంగా నష్టపోతున్నాం.
–వంగల ఈశ్వర్ రావు, రైతు


