పార్వతీపురం ఎమ్మెల్యే వ్యాఖ్యలపై నిరసన | - | Sakshi
Sakshi News home page

పార్వతీపురం ఎమ్మెల్యే వ్యాఖ్యలపై నిరసన

May 13 2026 1:02 AM | Updated on May 13 2026 1:02 AM

పార్వతీపురం రూరల్‌: రెవెన్యూ అధికారులపై పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర చేసిన అనుచిత వ్యాఖ్యలను జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఖండించింది. ఈ నెల 9న పార్వతీపురం మండలం అడ్డపుశీల గ్రామ పరిధిలోని సర్వే నెం.70/2లో గల గెడ్డ పోరంబోకు భూమి ఆక్రమణల విషయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రెవెన్యూ సిబ్బందిపై పరుష పదజాలం వాడటంపై సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఉద్యోగుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం బాధాకరమని సంఘ అధ్యక్ష, కోశాధికారులు జి.శ్రీరామమూర్తి, పి.సత్యలక్ష్మీ కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవస్థలో ఎవరైనా తప్పుచేస్తే వారిపై చర్యలు తీసుకోవడానికి అభ్యంతరం లేదని, విధుల్లో ఉన్న ఉద్యోగులందరినీ కలిపి నిందించడం తగదన్నారు. ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

దళితుల హక్కులను కాపాడండి

రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ సభ్యుడు

రావాడ సీతారాం

విజయనగరం: దళిత వర్గాల హక్కులను కాపాడి, వారి ఆర్థికాభివృద్ధికి సహకారం అందివ్వాలని అధికార వర్గాలకు రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ సభ్యుడు రావాడ సీతారాం సూచించారు. విజయనగరంలోని ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా కార్పొరేషన్‌ పరిధిలో పనిచేస్తున్న దళిత ఉద్యోగుల వినతులను స్వీకరించారు. ఆ తర్వాత దళిత సంఘాల నేతలు, దళితుల నుంచి వచ్చిన వినతి పత్రాలను అందుకున్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరిపి పరిష్కరించారు. మధ్యాహ్నం పలువురి నుంచి వచ్చిన వినతులపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. అనంతరం సీతారాం మాట్లాడుతూ దళితుల హక్కులను పూర్తిగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రిజర్వేషన్ల ప్రాతిపదికన నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పించాలన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు విస్తృత పర్యటనలు చేపడుతున్నామన్నారు. ప్రతి దళిత కుటుంబంలోని ఒకరిని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వం ధ్యేయమని పునరుద్ఘాటించారు. వివిధ శాఖలలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ఎస్సీ సొసైటీకి 22 శాతం రిజర్వేషన్‌ ప్రాతిపదికన అవకాశాలు కల్పించాలన్నారు. దళితులు, దళిత సంఘాలు, దళిత ఉద్యోగుల నుంచి వచ్చిన వినతులను 15 రోజుల్లోగా పరిష్కరించి తనకు నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశించారు. సమావేశంలో విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ బాలస్వామి, సహాయ కమిషనర్‌ కిల్లాన అప్పలరాజు, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ జీవనరాణి, డీసీహెచ్‌ఎస్‌ పద్మశ్రీ రాణి, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ యం.లక్ష్మణరావు, ప్రభుత్వ వైద్య కళాశాల ఏడీ, తదితరులు పాల్గొన్నారు.

ఖరీఫ్‌లో 48 వేల క్వింటాళ్ల వరి విత్తనాలు

● వ్యవసాయ శాఖ జేడీ తారకరామారావు

కొత్తవలస: రానున్న ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలోని రైతులకు రాయితీపై అందజేసేందుకు 48వేల క్వింటాళ్లు వరి విత్తనాలను సిద్ధం చేశామని, అందులో 35 వేల క్వింటాళ్లు 1121 రకం విత్తనాలేనని వ్యవసాయ శాఖ జేడీ వి.తారకరామారావు తెలిపారు. కొత్తవలస ఏడీఏ కార్యాలయాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో వరి సాధారణ విస్తీర్ణం లక్షా15వేల ఎకరాలుగా పేర్కొన్నారు. 38 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అందుబాటులో ఉంచుతామన్నారు. ఎకరానికి 75 కేజీల యూరియా మాత్రమే అందజేస్తామన్నారు. వ్యవసాయ పరికరాలు కావాల్సిన రైతులు రైతు సేవాకేంద్రాల్లో ఈనెల 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆయన వెంట ఏడీఏ భానులత ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement