నీట్‌ పేపర్‌ లీకేజీపై ఎస్‌ఎఫ్‌ఐ సమరభేరి | - | Sakshi
Sakshi News home page

నీట్‌ పేపర్‌ లీకేజీపై ఎస్‌ఎఫ్‌ఐ సమరభేరి

May 13 2026 1:02 AM | Updated on May 13 2026 1:02 AM

● నేరగాళ్లను కఠినంగా

శిక్షించాలని డిమాండ్‌

విజయనగరం గంటస్తంభం: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్‌ ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారంపై విద్యార్థి లోకం భగ్గుమంది. భారత విద్యార్ధి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో మంగళవారం విజయనగరం పట్టణంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. విద్య అమ్మకానికి కాదు–మా హక్కు, నీట్‌ మాఫియాను అంతం చేయాలంటూ విద్యార్థులు నినదించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మోహనరావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన విద్యా వ్యవస్థను కార్పొరేట్‌ శక్తులకు తాకట్టు పెడుతున్నారని విమర్మించారు. రాత్రింబవళ్లు కష్టపడి చదివే పేద, మధ్యతరగతి విద్యార్థుల కలలను ఈ విద్యా మాఫియా చిదిమేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్‌టీఏ వైఫల్యం..

2015 నుంచి నేటి వరకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించిన పరీక్షల్లో నాలుగు సార్లు నీట్‌ పేపర్‌ లీక్‌ అవ్వడం, యూజీసీ నెట్‌ రద్దు కావడం చూస్తుంటే వ్యవస్థ ఎంతలా దిగజారిందో అర్ధమవుతోందని రామ్మోహనరావు అన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు నీట్‌ వల్ల తీవ్ర అన్యాయం జరుగుతోందని, అందుకే తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయని గుర్తుచేశారు. రాష్ట్ర నాయకులు కేంద్రానికి వత్తాసు పలకడం మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్మి డి.రాము, గర్‌ల్స్‌ కన్వీనర్‌ శిరీష్‌, జిల్లా నాయకులు సోమేష్‌, జగదీష్‌,నాని, డీవైఎఫ్‌ఐ నాయకులు హరీష్‌, రవి, పెద్ద సంఖ్యలో విద్యార్ధులు పాల్గొన్నారు.

విద్యావ్యవస్థలో అవనితీని అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న విద్యార్థులు

Advertisement
 
Advertisement
Advertisement