● ‘పచ్చ’ పత్రిక విలేకరి చేతిలో మోసపోయానని మహిళానేత ఆవేదన
● పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం
● సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సూసైడ్ నోట్
● కేజీహెచ్‌లో బాధితురాలి పరిస్థితి విషమం
మెంటాడ: ‘శివ అంకుల్ నా చావుకు కారణం.. నన్ను ఒక ఏటీఎంలా వాడుకున్నాడు.. తీయని మాటలతో నమ్మించి, హోటళ్లకు తీసుకెళ్లి సర్వస్వం దోచుకున్నాడు.. 2019 నుంచి తన బాధ్యత, పిల్లల బాధ్యత చూస్తానని నమ్మించి భర్తలా కాపురం చేశాడు... ఆయన స్వార్థానికి నన్ను బలిచేశాడు.. ఆర్థికంగానూ దోచుకున్నాడు. నేను ఏ తప్పూచేయలేదు. నన్ను నీవు నమ్మితే చాలు అంటూ తన కుమారుడికి మెంటాడ మండలానికి చెందిన ఓ మహిళా నాయకు రాలు రాసిన సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన చివరి కోరికగా తన భర్తగా చలామణి అయిన శివకేశవనాయుడే తనకు తల కొరివి పెట్టాలని ఆ నోట్‌లో పేర్కొంది. విశాఖప ట్నంలో మంగళవారం వేకువజామున పురుగులు మందు సేవించిన బాధితురాలు ప్రస్తుతం విశాఖపట్నం కేజీహెచ్‌లో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. మెంటాడకు చెందిన ‘పచ్చ’ పత్రిక విలేకరి శివకేశవనా యుడు తనను దోచుకున్న తీరు, మోసం చేసిన తీరును బాధితురాలు తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. అయితే, దీనిపై ఇప్పటివరకు స్థానికంగా ఎలాంటి కేసు నమోదుకాకపోవడం గమనార్హం. ఆ విలేకరి ఓ మంత్రికి అత్యంత ఆప్తుడు కావడమే దీనికి కారణమని స్థానికంగా చర్చ నడుస్తోంది. కేసు నమో దు విషయాన్ని మెంటాడ ఎస్‌ఐ కె.సీతారాము వద్ద ప్రస్తావించగా ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. విశాఖలో జరిగిన ఘటనగా పేర్కొన్నారు.


