మున్సిపల్‌ అధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ అధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం

May 13 2026 1:02 AM | Updated on May 13 2026 1:02 AM

పద్ధతి మార్చుకోకుంటే వేటు

తప్పదని హెచ్చరిక

సొంత ప్రభుత్వంపైనే ‘టీడీపీ’

నేతల నిలదీత

పార్వతీపురం రూరల్‌: ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలోకి వచ్చిన కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. ప్రభాకర రెడ్డికి మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యం, పాలకుల వైఫల్యాలు ముఖాముఖి దర్శనమిచ్చాయి. ఈ మేరకు మంగళవారం స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన ‘ముఖాముఖి’ కార్యక్రమంలో అధికారులపై కలెక్టర్‌ నిప్పులు చెరిగారు. ఒకవైపు అధికారులు బాధ్యతలను గాలికొదిలేయడం, మరోవైపు గత రెండేళ్లుగా అధికారంలో ఉండి ఏమీ చేయని కూటమి నేతలు.. ఇప్పుడు తమ ప్రభుత్వంపైనే నిరసన తెలపడం పట్టణంలో విడ్డూరంగా మారింది.

నిర్లక్ష్యం నీడన నగరపాలన

కార్యక్రమంలో భాగంగా వివిధ వార్డుల నుంచి వచ్చిన ప్రజలు తమ గోడును కలెక్టర్‌ ముందు వెళ్లబోసుకున్నారు. జగన్నాథపురంలో చెరువు ఆక్రమణలు, నాయుడు వీధిలో మంచినీటి ఎద్దడి, నిర్మల కాలనీలో ప్రభుత్వ స్థలాల కబ్జాపై వినతులు వెల్లువెత్తాయి. మున్సిపల్‌ పరిధిలో గ్రామాచావిడి, బందెలదొడ్డి వంటి స్థలాలు అక్రమార్కుల పరమవుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరించడంపై కలెక్టర్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కనీసం మురుగు కాలువలు శుభ్రం చేయలేని స్థితిలో యంత్రాంగం ఉందంటే పాలన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని విమర్శలు వినిపించాయి.

సొంత సర్కారుపైనే టీడీపీ నేతల నిరసన

ఈ కార్యక్రమంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. గత రెండేళ్లుగా పదవుల్లో ఉండి పట్టణ సమస్యలను పట్టించుకోని కూటమి వార్డు కౌన్సిలర్లు, ఇప్పుడు ముందస్తు పథకం ప్రకారం కలెక్టర్‌ వద్దకు వచ్చి తమ ప్రభుత్వంపైనే ఫిర్యాదులు చేయడం. అధికారంలో ఉన్నప్పుడే సమస్యలు పరిష్కరించని వారు, ఇప్పుడు ప్రత్యేక అధికారి పాలనలో పనులు జరగడం లేదంటూ ప్రజల ముందు హడావుడి చేయడం విస్మయానికి గురిచేసింది. కూటమి ప్రభుత్వ శ్రేణులే తమ హయాంలో పనులు కావడం లేదని నిలదీయడం చూస్తుంటే, ప్రభుత్వ యంత్రాంగంపై పట్టు కోల్పోయినట్లు స్పష్టమవుతోంది.

తమాషాలు చేస్తున్నారా? కలెక్టర్‌ వార్నింగ్‌

అధికారుల అసమర్థతను గమనించిన కలెక్టర్‌ ప్రభాకర రెడ్డి మున్సిపల్‌ సిబ్బందిపై కన్నెర్ర చేశారు. మీ పని మీరు చేయడానికి కలెక్టర్‌ ఎందుకు? కమిషనర్‌ ఎందుకు? కనీసం చిన్న ప్రతిపాదనలు చేయడం కూడా చేతకాదా?‘ అంటూ సూటిగా ప్రశ్నించారు. కలెక్టర్‌ పేరు వాడుకుని ‘ఎక్స్‌ట్రాలు’ చేస్తే సహించేది లేదని, అధికారుల వెనుక ఉండి ఎవరు నడిపిస్తున్నారో తనకు అన్నీ తెలుసని గుట్టు విప్పారు. చట్టం ముందు ఎవరూ సమానులు కాదని, వినయ విధేయతలు లేకుండా ప్రజలను ఇబ్బంది పెట్టే అధికారులపై వేటు తప్పదని హెచ్చరించారు.

ముఖ్యంగా వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో పారిశుధ్యం విషయంలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని, తక్షణమే పెండింగ్‌ పనులన్నీ పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టర్‌ కఠినంగా వ్యవహరిస్తున్నా, స్థానిక రాజకీయ వర్గాల అండతో అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం పట్టణ వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, కమిషనర్‌ పావని తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement