రూ.కోట్ల విలువ చేసే స్థలంపై అధికార పార్టీ నేత కన్ను అదే స్థలంలో పార్టీ కార్యాలయం కోసం జిల్లా అధ్యక్షురాలు ప్రయత్నం శంకుస్థాపనకు సిద్ధమవ్వగా స్థానికుల అభ్యంతరం న్యాయస్థానికి వెళ్లి స్టేటస్ కో ఉత్తర్వులు బాధితుల వెనుక ‘కబ్జా’ నేత అర్ధాంతరంగా ఆగిన భూమి పూజ ‘పార్టీ భవనం’ చుట్టూ రేగుతున్న వివాదం
సాక్షి, పార్వతీపురం మన్యం:
తెలుగుదేశం పార్టీ పార్వతీపురం మన్యం జిల్లా కార్యాలయం స్థలం చుట్టూ వివాదం రేగుతోంది. పార్టీలో అంతర్గతంగా ఉన్న కుమ్ములాటలు మరో స్థాయికి చేరాయి. ఈ వివాదాలతోనే భవన నిర్మా ణం కోసం సోమవారం జరగాల్సిన భూమిపూజ కూడా నిలిచిపోవడం గమనార్హం. జిల్లా యంత్రాంగాన్ని ఇందులో ఇరికించే ప్రయత్నం చేయడం కొసమెరుపు.
పార్వతీపురం పరిధి సుందర నారాయణపురం రెవెన్యూ గ్రామం సర్వే నంబర్ 619–1లో సుమారు 2.23 ఎకరాల విస్తీర్ణం స్థలం ఉంది. దీనిపై అధికార పార్టీకి చెందిన నియోజకవర్గ ముఖ్యనేత కన్ను పడింది. రూ.కోట్ల విలువచేసే ఈ స్థలాన్ని తన అనుచరుల పేరిట పట్టాలు చేయించి, స్వాధీనం చేసుకోవాలని తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేశారు. వాస్తవానికి ఈ స్థలం వివాదంలో ఉంది. చాలా కాలంగా తాము సాగు చేసుకుంటున్నామని కొంత మంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రెవెన్యూ రికార్డుల్లో అది ప్రభుత్వ భూమిగానే ఉంది. వివాదంలో ఉన్నప్పటికీ.. సదరు నేత అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో రెవెన్యూ యంత్రాంగం నుంచి సహకారం కరువైంది. దీంతో గత పార్వతీపురం తహసీల్దార్‌ను ఇక్కడ నుంచి బదిలీ చేసేయాలని జిల్లా యంత్రాంగం మెడపై సదరు ముఖ్యనేత కత్తి పెట్టారు. అందులో భాగంగానే అప్పటి తహసీల్దార్ సురేష్‌ను సాలూరు బదిలీ చేశారు. ఇప్పటికీ ఆ స్థలం కోసం ఆయన పట్టు వీడలేదు. ప్రయత్నం ఆపలేదు.
ఈ వివాదం నడుస్తుండగానే.. మరో టీడీపీ నేత కూడా అదే స్థలంపై కన్నేశారు. ఆ స్థలంలో ఉన్నవారికి కొంత మొత్తం ఇచ్చి, స్వాధీనానికి ప్రయత్నం చేశారు. అప్పటికే నియోజకవర్గ కీలక నేత స్కెచ్ ఉండడంతో సఫలీకృతం కాలేదని సమాచారం. ఇదే సమయంలో టీడీపీ అరకు పార్లమెంటు అధ్యక్షురా లు తేజోవతి.. పార్టీ జిల్లా కార్యాలయం కోసం స్థ లం ఇప్పించాలని అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు మూడు, నాలుగు చోట్ల అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను చూపించారు. అందులో సర్వే నంబర్ 619–1 స్థలం కూడా ఒకటి. ఇదే స్థలాన్ని తేజోవతి కోరుకున్నారు. వివాదాలు ఉంటే పరిష్కారం అవుతాయని ఆశించారు. కేబినె ట్ భేటీలో కూడా అంగీకారం తీసుకున్నారు.
దీనిపై అధికారికంగా ఎటువంటి జీవో కూడా రాలేదు. అయినప్పటికీ, కార్యాలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేసేసుకున్నారు. సోమవారం శంకుస్థాపన పెట్టుకున్నారు. ఆదివారం సాయంత్రం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వివాదంలో ఉండటమే కారణమని ఆ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు.


