ఉపాధి నిధుల కోసం దళిత లబ్ధిదారుల ఆవేదన కలెక్టరేట్ వద్ద నిరసన
పార్వతీపురం రూరల్:
రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదల కష్టాన్ని కొందరు అక్రమార్కులు అధికారుల అండతో కాజేశారని, విచారణలో వాస్తవాలు తేలినా తమకు న్యాయం జరగలేదని బలిజిపేట మండలం పెదపెంకి గ్రామ దళిత లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్ ఫిర్యాదు చేసిన అనంతరం బాధితులు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మథరావు, గ్రామపెద్దలు శ్రీనివాసరావు, నగిరి పాపారావు మాట్లాడుతూ.. 2022–23 ఆర్థిక సంవత్సరంలో జగనన్న ఇళ్లు నిర్మించుకున్న సుమారు 40 మంది దళిత కుటుంబాలకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రావాల్సిన రూ. 24.80 లక్షల ఎర్త్ వర్క్ నిధులు ఇప్పటికీ చెల్లించలేదన్నారు. అధికా రులను ప్రలోభపెట్టిన కొందరు వ్యక్తులు, లబ్ధిదారుల ప్రమేయం లేకుండానే ఆ నిధులను తమ సొంత ఖాతాలకు మళ్లించి డ్రా చేసుకున్నారని ఆరోపించారు. గతంలోనే దీనిపై ఫిర్యాదు చేయగా, విచారణ జరిపిన ఉన్నతాధికారులు బాధ్యులైన టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్‌లను సస్పెండ్ చేశారని గుర్తుచేశారు. అక్రమం జరిగిందని తేలి, అధికారులపై చర్యలు తీసుకున్నప్పటికీ, బాధితుల కు అందాల్సిన సొమ్ముపై మాత్రం స్పష్టత ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. తక్షణమే నిధులు విడుదల చేసి లబ్ధిదారులకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బాధిత కుటుంబసభ్యులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.


