● కోటి సంతకాల సేకరణ ● అక్రమ గోరవాణా అరికట్టాలి ● కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేత
పార్వతీపురం రూరల్: జాతీయ ప్రాణిగా గోవును ప్రకటించాలని కోరుతూ కోటి సంతకాల సేకరణ లక్ష్యంతో ఇచ్ఛాపురం నుంచి హిందూపురం వరకు ఆరు నెలల పాటు ’గోరక్షా రథయాత్ర’ నిర్వహిస్తున్నట్లు ధర్మో రక్షతి రక్షితః ఫౌండేషన్, దళిత సేన ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు తెలిపారు. అలాగే జిల్లాలో అక్రమ గోరవాణా, గోవధను అరికట్టేందుకు జంతు హింస నివారణ సంఘం (ఎస్పీసీఏ) ద్వారా పటిష్ట చర్యలు చేపట్టాలని కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్పీసీఏ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించి అధికారులను అప్రమత్తం చేయాలని విన్నవించారు. కమిటీలోని సభ్యుల వివరాలను నోటీసు బోర్డులో ప్రదర్శించడంతో పాటు, అక్రమ గో వధశాలలపై ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను నియమించాలని కోరారు. పశువుల సంతల వద్ద గోవధ నిరోధక చట్టాలపై అవగాహన బోర్డులు ఏర్పాటు చేయాలని విన్నవించారు. రసాయన ఉత్పత్తుల వాడకంతో ప్రజారోగ్యం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బూసిం వై.వి.సత్యనారాయణ, మట్టికొయ్య పోతురాజు తదితరులు పాల్గొన్నారు.


