గడువులోగా అర్జీలు పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

గడువులోగా అర్జీలు పరిష్కరించండి

May 12 2026 12:20 AM | Updated on May 12 2026 12:20 AM

కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి

ఆదేశాలు

విజయనగరం ఫోర్ట్‌: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమంలో ప్రజలు అందజేసిన వినతులకు గడువు లోగా పరిష్కారం చూపాలని కలెక్టర్‌ ఎస్‌. రాంసుందర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లోని సమావేశ భవనంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో జేసీ సేతుమాధవన్‌తో కలిసి కలెక్టర్‌ వినతులు స్వీకరించారు. పీజీఆర్‌ఎస్‌ అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిర్యాదులు రీఓపెన్‌ కావడానికి వీల్లేదని, ఒకవేళ అలా జరిగితే సంబంధిత అధికారి తప్పకుండా క్షేత స్థాయి పర్యటన చేసి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌కు 172 వినతులు రాగా వాటిలో రెవెన్యూశాఖకు 85, మున్సిపాల్టీ 9, జిల్లా పంచాయతీకి 17, డీఆర్‌డీఏ 15, విద్యుత్‌శాఖకు 2, గ్రామ/వార్డు సచివాలయాలకు 5, విద్యాశాఖ 6, వైద్యశాఖ 2, గృహనిర్మాణశాఖ 1, ఇతర శాఖలకు 30 వచ్చాయి.

ఎస్పీ పీజీఆర్‌ఎస్‌కు 33 ఫిర్యాదులు

విజయనగరం క్రైమ్‌: జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యకామాన్ని ఎస్పీ తన చాంబర్‌లో సోమవారం నిర్వహించి మొత్తం 33 ఫిర్యాదులు స్వీకరించారు. అందులో భూతగాదాలకు సంబంధించి 7, కుటుంబ కలహాలకు సంబంధించి 6, చీటింగ్‌కు సంబంధించి 1, ఇతర అంశాలకు సంబంధించి 19 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ దామోదర్‌ తెలిపారు. సంబంధిత అధికారులు ఫిర్యాదు అంశాలను పరిశీలించి వాటి పూర్వాపరాలను విచారణ చేసి, ఫిర్యాదు అంశాల్లో వాస్తవాలను గుర్తించి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, ఏడు రోజుల్లో సమస్యలను పరిష్కరించేందుకు సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీసీఆర్బీ సీఐ కె.కుమారస్వామి, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, ఎస్సైలు రాజేష్‌, ప్రభావతి, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

పార్వతీపురం: ప్రజల నుంచి వచ్చిన సమస్యలను నిర్ణేత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్‌ డా.ఎన్‌. ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి, డీఆర్‌ఓ కె. హేమలత, ఎస్‌డీసీ దిలీప్‌ చక్రవర్తితో కలిసి కలెక్టర్‌ 74 వినతులు స్వీకరించారు. అర్జీల్లో రెవెన్యూకు సంబంధించి 14, 60 సాధారణ వినతులు ఉన్నాయన్నారు. ప్రతి అర్జీని సానుభూతితో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్‌ సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement