● సమ్మర్ క్యాంప్‌ల చెల్లింపుల్లేవు
● 5నెలలుగా అందని వేతనాలు,
● చెల్లించని బిల్లులు
శృంగవరపుకోట: సమాజానికి విజ్ఞానాన్ని పంచి, జ్ఞానాన్ని, సంస్కారాన్ని అందించే భాండాగారాలు గ్రంథాలయాలు. అటువంటి గ్రంథాలయాలు నేడు వేతనాలు రాక, పేపర్ బిల్లులు అందక, కరెంటు బిల్స్ కట్టలేక, అద్దెలు చెల్లించక, స్వీపర్లకు చెల్లింపులు చేయక, వాటర్‌బిల్లులు ఇచ్చే నాథులు లేక అవస్థలతో అల్లాడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న లైబ్రరీలు, బుక్‌డిపోలు నిర్లక్ష్యపు నీడన కొట్టుమిట్టాడుతున్నాయి. వేతనాల్లేక లైబ్రేరియన్లు అవస్థలు పడుతున్న తరుణంలో కంటింజెన్స్ బిల్లులు రాక నిర్వహణ కోసం నీళ్లు నములుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఒక గ్రేడ్–1 లైబ్రరీ, 4 గ్రేడ్–2 లైబ్రరీలు, 38గ్రేడ్–3 లైబ్రరీలు, 3గ్రామ గ్రంథాలయాలు ఉన్నాయి. వాటితో పాటు 80 బీడీసీ (బుక్‌డిపో సెంటర్లు)లు సేవలందిస్తున్నాయి. ప్రస్తుతం ఐదు నెలలుగా ప్రభుత్వం నుంచి బిల్లులు అందక గ్రంథాలయాలు నిర్లక్ష్యపు నీడన కొట్టుమిట్టాడుతున్నాయి.
ఐదు నెలలుగా అవస్థలు
ప్రభుత్వం గత ఐదు నెలలుగా గ్రంథాలయాల ఊసెత్తలేదు. గత ఏడాది నిర్వహించిన సమ్మర్‌క్యాంప్‌కు చెల్లించాల్సిన రూ.15వేలు ఇంత వరకూ చెల్లించలేదు. ఈ ఏడాది సమ్మర్‌క్యాంప్‌లకు ఇంకా ఒక్క పైసా విదల్చకుండానే నిర్వహణ భారాన్ని లైబ్రేరియన్ల నెత్తిన మోపారు. ఐదు నెలలుగా ల్రైబేరియన్లకు వేతనాలు లేవు. పేపర్ బిల్లులు, విద్యుత్ బిల్లులు, అద్దెలు, స్వీపర్ల వేతనాలు, వాటర్ బిల్లులు ఏమీ చెల్లించలేదు. దీంతో వేతనాలు లేక, బిల్లులు రాక లైబ్రరీల నిర్వహణ కోసం లైబ్రేరియన్లు అవస్థలు పడుతున్నారు.
అధ్వాన స్థితిలో బీడీసీలు
జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో సుమారు 80 బుక్ డిపో సెంటర్లు నడుస్తున్నాయి. బీడీసీల నిర్వాహకులకు నెలకు రూ.3000 చొప్పున గౌరవవేతనం, పత్రికల కోసం రూ.500లు ప్రభుత్వం చెల్లిస్తుండగా, గత ఐదు నెలలుగా బీడీసీల ఊసెత్తలేదు. దీంతో గ్రామాల్లో బీడీసీల నిర్వాహకులు దిక్కుతోచని ిస్థితిలో ఉన్నారు.
ప్రయత్నం చేస్తున్నాం
గత ఐదు నెలలుగా వేతనాలు, బిల్లులు చెల్లించాల్సి ఉంది. బీడీసీలకు చెల్లింపులు చేయాలి. పంచాయతీలు వసూలు చేస్తున్న లైబ్రరీ సెస్సు అందక ఇబ్బందులు ఉన్నాయి. పంచాయతీల నుంచి సెస్సు వసూలు కోసం మున్సిపాలిటీ, పంచాయతీ కార్యాలయాలకు వెళ్తున్నాం. కలెక్టర్ దృష్టికి సమస్య తీసుకెళ్లాం. వీలైనంత త్వరగా చెల్లింపులు చేసే ప్రయత్నం చేస్తున్నాం.
– బి.లక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి


