సాగర తీరాన..సందడి..! | - | Sakshi
Sakshi News home page

సాగర తీరాన..సందడి..!

May 11 2026 8:50 AM | Updated on May 11 2026 8:50 AM

సాగర తీరాన..సందడి..! ● ఆలివ్‌ రిడ్లేలకు అభయంగా విజయనగరం తీరం ● తీరం చేరిన అరుదైన తాబేళ్లు ● వందల కిలోమీటర్లు దాటి వచ్చి గూళ్లు కడుతున్న పర్యావరణ మిత్రులు ● 10 హేచరీస్‌ల ద్వారా 52 వేల గుడ్ల సంరక్షణ ● సముద్రంలోకి 41 వేల తాబేళ్ల పిల్లల విడుదల ● మత్స్యకారుల తోడ్పాటు.. అటవీ శాఖ అప్రమత్తత ● సంరక్షణకు అటవీ శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు ● మత్స్యకారుల్లో అటవీ శాఖ అవగాహన కార్యక్రమాలు

● ఆలివ్‌ రిడ్లేలకు అభయంగా విజయనగరం తీరం ● తీరం చేరిన అరుదైన తాబేళ్లు ● వందల కిలోమీటర్లు దాటి వచ్చి గూళ్లు కడుతున్న పర్యావరణ మిత్రులు ● 10 హేచరీస్‌ల ద్వారా 52 వేల గుడ్ల సంరక్షణ ● సముద్రంలోకి 41 వేల తాబేళ్ల పిల్లల విడుదల ● మత్స్యకారుల తోడ్పాటు.. అటవీ శాఖ అప్రమత్తత ● సంరక్షణకు అటవీ శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు ● మత్స్యకారుల్లో అటవీ శాఖ అవగాహన కార్యక్రమాలు

విజయనగరం గంటస్తంభం:

వి పర్యావరణ రాయబారులు.. సముద్రపు ఆరోగ్యాన్ని చాటిచెప్పే సంకేతాలు. ప్రకృతి సమతుల్యానికి ప్రతీకలైన ఆలివ్‌ రిడ్లే తాబేళ్ల సంరక్షణలో విజయనగరం జిల్లా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. సముద్ర తీరాన్ని ఆశ్రయించి సంతానోత్పత్తి కోసం వచ్చే ఈ అరుదైన తాబేళ్లను రక్షించేందుకు అటవీ శాఖ విస్తృత చర్యలు చేపట్టింది. స్వచ్ఛంద సంస్థల సహకారంతో తీర ప్రాంతాల్లో హేచరీలు ఏర్పాటు చేసి గుడ్లను భద్రపరుస్తూ, పిల్లలుగా పొదిగిన అనంతరం తిరిగి సముద్రంలోకి విడిచిపెడుతోంది. 2025–26 సీజన్‌లో ఇప్పటివరకు జిల్లాలో 52 వేల తాబేళ్ల గుడ్లను సేకరించగా, వాటిలో 41 వేల పిల్లలను విజయవంతంగా సముద్రంలోకి విడుదల చేశారు. మిగిలిన గుడ్లును కూడా ప్రత్యేక సంరక్షణలో ఉంచి పిల్లలుగా మారిన వెంటనే సముద్రంలో విడిచిపెట్టేందుకు అధికారులుచర్యలు చేపడుతున్నారు.

పర్యావరణ హితులైన ఆలివ్‌ రిడ్లేలు

ఆలివ్‌ రిడ్లే తాబేళ్లు సముద్ర జీవ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి కనిపించే ప్రాంతాలు కాలుష్యం తక్కువగా ఉండే పర్యావరణ హిత ప్రాంతాలుగా గుర్తింపు పొందుతాయి. గుజరాత్‌ నుంచి ఒడిశా వరకు భారత తీర ప్రాంతాల్లో ఇవి సంచరిస్తూ సంతతి వృద్ధి కోసం ప్రశాంతమైన తీరాలను ఎంపిక చేసుకుంటాయి. అలల తీవ్రత తక్కువగా ఉండే, మానవ కదలికలు తగ్గిన ప్రాంతాల్లో గూళ్లు కట్టి ఒక్కో తల్లి తాబేలు 100 నుంచి 130 వరకు గుడ్లు పెడుతుంది.

పది హేచరీస్‌లతో సంరక్షణ కవచం

జిల్లాలోని బొడ్డుగుయ్యపేట, తిప్పలవలసల్లో రెండేసి చొప్పున, చేపలకంచేరు, ముక్కాం, చోడిపల్లిపేట, పులిగెడ్డపాలెం, బర్రిపేట, చింతపల్లి ప్రాంతాల్లో ఒక్కో హేచరీస్‌ ఏర్పాటు చేశారు. మొత్తం పది హేచరీల్లో ప్రస్తుతం 246 గూళ్లను భద్రపరిచి సంరక్షిస్తున్నారు. హేచరీస్‌ల వద్ద ప్రత్యేక సిబ్బందిని నియమించి గుడ్ల సంరక్షణతో పాటు పిల్లలు బయటకు వచ్చిన వెంటనే సముద్రంలోకి విడిచిపెట్టే ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ఇందుకోసం 25 మంది సిబ్బందిని నియమించినట్లు అధికారులు తెలిపారు.

మత్స్యకారుల్లో అవగాహన

ఆలివ్‌ రిడ్లే తాబేళ్ల సంరక్షణలో మత్స్యకారుల పాత్ర కీలకమని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రమాదకరమైన వేట వలలు, గ్రిల్‌నెట్స్‌, టేకు వలలు వల్ల తాబేళ్లు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో తీర గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాబేళ్లు చిక్కుకున్నప్పుడు వెంటనే సముద్రంలో వదిలేయాలని సూచిస్తున్నారు.

వలల మృత్యుపాశం.. టెడ్‌ వాడకం అనివార్యం

సముద్రంలో చేపల వేట కోసం వాడే యాంత్రిక బోట్ల వలల్లో చిక్కుకుని ఏటా వందలాది తాబేళ్లు ప్రాణాలు కోల్పోతున్నాయి. శ్వాస తీసుకోవడానికి ఇవి పైకి రావాల్సి ఉంటుంది. కానీ వలల్లో చిక్కుకుపోవడం వల్ల ఊపిరాడక మృత్యువాత పడుతున్నాయి. దీనిని అరికట్టేందుకు టెడ్‌ పరికరాలను వలలకు అమర్చుకోవాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement