గుమ్మలక్ష్మీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన రైతులు పెద్ద సంఖ్యలో జీడిమామిడి తోటలు సాగు చేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 64,935 ఎకరాల్లో జీడిమామిడి సాగవుతుంది. ఒక్క కురుపాం నియోజకవర్గంలోనే 42,500 ఎకరాల్లో జీడిమామిడి సాగవుతోంది. వీటి దిగుబడులైన జీడిపిక్కలను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం, సమీపంలో మార్కెట్ సదుపాయం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యాపారులను రైతులు ఆశ్రయిస్తూ మోసపోతున్నారు. మోసపోతున్నామని తెలిసినా విక్రయించక తప్పని పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు వాతావరణ పరిస్థితులు కూడా కలసిరాకపోవడంతో అనుకున్న స్థాయిలో దిగుబడులు రాకపోవడం, వచ్చిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో గిరిజన రైతులు ప్రతి ఏటా తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో వీటి ధరను ప్రైవేటు వ్యాపారులే సిండికేట్ అయి నిర్ణయిస్తున్నారు. గిరిజన రైతులను మోసపుచ్చుతున్నారు. గడిచిన మార్చి, ఏప్రిల్ నెలలో కిలో జీడిపిక్కలు రూ.160లుగా నిర్ణయించి, ప్రస్తుతం ధర పడిపోయిందంటూ కిలో రూ.140లుగా నిర్ణయించి దోచుకుంటున్నారు. గిరిజన రైతులను దళారులు, ప్రైవేటు వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి నిలువునా దోచుకుంటున్నా... పాలకులుగాని, అధికారులుగాని పట్టించుకోవడం లేదు. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఆదాయ వనరుగా జీడిమామిడి ఉంది. వాణిజ్య పంట అయిన జీడిమామిడికి గిట్టుబాటు ధర చెల్లించకపోవడం, గిరిజనుల పేరిట పుట్టుకొచ్చిన ఐటీడీఏ, జీసీసీలు దృష్టి పెట్టకపోవడంపై వారు ఆవేదన చెందుతున్నారు. మన్యంలో గిరిజన శాసనసభ్యులున్నా తమకు ప్రయోజనం లేకపోతుందని రైతులు వాపోతున్నారు.
రూ.200 చెల్లించాలి
పార్వతీపురం మన్యం జిల్లాలో గుమ్మలక్ష్మీపురం, కురుపాం, సీతంపేట తదితర మండలాల్లో గిరిజన రైతులు విస్తారంగా జీడిమామిడి తోటలు సాగు చేస్తున్నారు. జీడిపిక్కలకు మద్దతు ధర ప్రకటించకపోవడం, ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో నష్టపోతున్నామని రైతులు గగ్గోలు పెడుతున్నారు. మన్యంలోని గిరిజన శాసనసభ్యులు స్పందించి ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలు తీసుకువెళ్లాలని కోరుతున్నారు. జీడిమామిడి పిక్కలకు కిలో కనీస మద్దతు ధర రూ.200లు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని జీడి రైతులు కోరుతున్నారు.
మన్యం జిల్లాలో గిరిజన రైతులు వేలకొద్ది ఎకరాల్లో ప్రధాన ఆదాయ వనరుగా జీడిమామిడి పండిస్తున్నారు. వాణిజ్య పంట అయినప్పటికీ మద్దతు ధర కల్పించడంలో.. కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఇది సాగు రైతులను తీవ్రంగా నష్టం చేస్తుంది. ప్రైవేటు వ్యాపారులకు జీడిపిక్కలను విక్రయించాల్సిన పరిస్థితులను ప్రభుత్వమే పరోక్షంగా కల్పిస్తోంది. ఇది ఎంతమాత్రం సరికాదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జీడి రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలి.
– అడ్డాకుల చిన్నారావు, కురుపాం
జీడి పిక్కలను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో వ్యాపారులకు విక్రయించాల్సి వస్తోంది. వ్యాపారులు రోజు రోజుకు ధరను తగ్గిస్తూ కొనుగోలు చేస్తున్నారు. దీంతో తీవ్రంగా నష్టపోతున్నాం. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో వారికే అమ్ముకుంటున్నాం.
– మూటక మిన్నారావు,
రైతు,మూలజమ్ము గ్రామం


