పైళ్లెంది.. విషాదం మిగిలింది.. | - | Sakshi
Sakshi News home page

పైళ్లెంది.. విషాదం మిగిలింది..

May 11 2026 8:50 AM | Updated on May 11 2026 8:50 AM

పైళ్లెంది.. విషాదం మిగిలింది..

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థుల దుర్మరణం

కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు

వారిద్దరూ ఇంజినీరింగ్‌ విద్యనభ్యసిస్తున్నారు. ఒకరు శనివారం విజయనగరంలో జరిగిన

స్నేహితుడి పెళ్లికి వెళ్లాడు. పెళ్లి అనంతరం మళ్లీ తమ రూమ్‌కు వచ్చేందుకు అట్నుంచి

మరో స్నేహితుడితో కలిసి బైక్‌పై ఇద్దరూ వస్తున్నారు. ఇంతలోనే దారి కాచిన మృత్యువు వారిని అయినాడ జంక్షన్‌ వద్ద కాటేసింది. స్నేహితులతో సందడిగా.. సంతోషంగా అప్పటి వరకు గడిపిన వారిద్దరూ ఇంతలోనే మృత్యువు పాలవడంతో ఇటు కుటుంబాల్లోనూ... అటు స్నేహితుల్లోనూ

తీవ్ర విషాదం అలుముకుంది. వివరాల్లోకి వెళ్తే...

డెంకాడ/మక్కువ/సీతానగరం:

డెంకాడ మండలంలోని అయినాడ జంక్షన్‌ వద్ద శనివారం అర్ధరాత్రి 12.15 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు దుర్మణం చెందారు. ఎస్‌ఐ ఎ.సన్యాసినాయుడు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ వైపు నుంచి వస్తున్న డీసీఎం వ్యాన్‌ అయినాడ జంక్షన్‌ వద్ద చింతలవలస గ్రామం వైపు వచ్చేందుకు కుడివైపు తిరుగుతున్న క్రమంలో డీసీఎం వాహనాన్ని విజయనగరం నుంచి వస్తున్న మోటారుసైకిల్‌ ఢీకొంది. దీంతో మోటారు సైకిల్‌పై వెళ్తున్న తన్నా హర్షచైతన్య(19), రెడ్డి ఉదయ్‌కుమార్‌(20) తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోయారు. రోడ్డుపై తీవ్ర గాయాలతో పడి ఉన్న రెడ్డి ఉదయ్‌కుమార్‌ను విజయనగరం వైపు నుంచి విశాఖ వైపు అతివేగంతో వచ్చిన కారు ముందు భాగంతో కొంత దూరం ఈడ్చుకుపోయింది. దీంతో ఉదయ్‌కుమార్‌ అక్కడికక్కడే మరణించాడు. తీవ్రంగా గాయపడిన హర్షచైతన్యను చికిత్స నిమిత్తం విజయనగరం తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.

పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా..

తన్నా హర్షచైతన్య చింతలవలస ఎంవీజీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో బి.టెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. దీంతో చింతలవలసలోనే ఒక రూమ్‌ తీసుకుని ఉంటున్నాడు. శనివారం విజయనగరంలో ఓ పెళ్లికి వెళ్లిన హర్షచైతన్య తిరుగు ప్రయాణంలో స్నేహితుడు రెడ్డి ఉదయ్‌కుమార్‌తో మోటారు సైకిల్‌పై విజయనగరం నుంచి విశాఖ వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో అయినాడ జంక్షన్‌ వద్ద చింతలవలసకు వెళ్లేందుకు తిరగాలి. ఈ సమయంలో నిర్లక్ష్యంగా వస్తున్న డీసీఎం వాహనాన్ని మోటారుసైకిల్‌ ఢీకొంది. రెండు నిమిషాల్లో రూమ్‌కు చేరుకోవాల్సిన వీరు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో వారు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. మరణించిన హర్ణచైతన్యది మక్కువ మండలంలోని ఎ.వెంకంపేట గ్రామం. ఇదే ప్రమాదంలో మరణించిన రెడ్డి ఉదయ్‌కిరణ్‌ పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతానగరం మండలంలోని కొత్తవలస గ్రామం. సీఆర్‌ రెడ్డి కళాశాలలో ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఎ.సన్యాసినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement