మీ కోసం వెబ్‌సైట్‌లో అర్జీల నమోదు | - | Sakshi
Sakshi News home page

మీ కోసం వెబ్‌సైట్‌లో అర్జీల నమోదు

May 11 2026 8:50 AM | Updated on May 11 2026 8:50 AM

మడ్డువలసలో తగ్గుతున్న నీటిమట్టం రామతీర్థం సీనియర్‌ అసిస్టెంట్‌కు ఈఓగా ఉద్యోగోన్నతి అంగన్‌వాడీల ఆగ్రహం బోడికొండ వద్ద అభయాంజనేయుడు

పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో(పీజీఆర్‌ఎస్‌) అర్జీల వివరాలు మీకోసం వెబ్‌సైట్‌లో నమోదు చేయవచ్చునని కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. కలెక్టర్‌ కార్యాలయంలో ప్రతీ రోజు వినతులను స్వీకరించేందుకు ప్రత్యేక సెల్లార్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అర్జీదారులు మీకోసం ఏపి.జిఓవి.ఇన్‌ వెబ్‌సైట్‌లో అర్జీలను నమోదు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. అర్జీల స్థితిని 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కి ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చునని తెలిపారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా కలెక్టరేట్‌లో రెవెన్యూ క్లినిక్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టులో నీటిమట్టం గణనీ యంగా తగ్గింది. వేసవి కారణంగా వర్షపాతం తక్కువగా ఉండడంతో వేగావతి, సువర్ణముఖి నదుల్లో ఇన్‌ఫ్లోస్‌ భారీగా పడిపోయాయి. దీంతో ఆదివారం ప్రాజెక్టు వద్ద 62.47 మీటర్లు లెవెల్‌ నమోదైంది. వాస్తవంగా ప్రాజెక్టు అసలు నీటిమట్టం 65 మీటర్లు లెవెల్‌ ఉండగా దాదా పు 2.47 మీటర్లు మేర నీటి నిల్వ తగ్గింది. దీంతో ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో 3.37 టీఎంసీల కెసాసిటీ కలిగిన ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 1.33 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే నమోదైంది. ప్రాజెక్టు అధికారులు ప్రణాళిక ప్రకారం జూన్‌ మొదటి వారంలో ఖరీఫ్‌ పంటల సాగుకు నీరు విడుదల చేయాల్సి ఉంది. అలా జరగాలంటే వరుణుడు కరుణించాల్సిందేనని రైతులు చెబుతున్నారు.

నెల్లిమర్ల రూరల్‌: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న రామారావుకు పదోన్నతి లభించింది. ఆయనను గ్రేడ్‌–2 ఈఓగా నియమిస్తూ దేవదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో మాన్సాస్‌ సంస్థతో పాటు విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయంలో సుదీర్ఘ కాలం విధులు నిర్వర్తించారు. రామతీర్థం దేవాలయంలో మూడేళ్ల నుంచి సీనియర్‌ అసిస్టెంట్‌ హోదాలో సేవలందిస్తున్నారు. ప్రస్తుతం ఈఓగా పదోన్నతి లభించడంతో దేవస్థాన ఈఓ వై.శ్రీనివాసరావు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

విజయనగరం ఫోర్ట్‌ : అంగన్‌వాడీ హెల్పర్లకు తీవ్రంగా నష్టం చేసే జీఓ నంబరు 5ను వెంటనే రద్దు చేయాలని వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షురాలు లక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ ఎదుట ఆదివారం ధర్నా చేశారు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబరు 5 హెల్పర్ల పదోన్నతికి నష్టం చేసే విధంగా ఉందన్నారు. జీఓ నంబరు 2 ప్రకారం జిల్లాలో అంగన్‌వాడీ హెల్పర్లకు వెంటనే పదోన్నతి కల్పించాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో సీఐటీయూ జిల్లా కోశాధికారి జగన్‌మోహనరావు, జిల్లా కార్యదర్శి వెంకటేష్‌, యూనియన్‌ నాయకులు భారతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

నెల్లిమర్ల రూరల్‌: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న బోడికొండపై అభయాంజనేయస్వామి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రాష్ట్ర సాధు పరిషత్‌ ఆధ్వర్యంలో కొండకు దిగువ భాగంలో ఏర్పాటు చేసిన పిల్లర్‌పై క్రేన్‌ సహకారంతో ఆదివారం విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సుమారు పదమూడున్నర అడుగుల ఎత్తు, రెండు టన్నుల బరువుతో ఈ విగ్రహాన్ని రూపొందించారు. వచ్చే నెలలో విగ్రహానికి ప్రాణ ప్ర తిష్ఠ కార్యక్రమాలు జరిపిస్తామని నిర్వాహకు లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement