పాలకొండ రూరల్: ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ‘తల్లికి వందనం’ పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తామని ఎన్నికల ముందు కూటమి నాయకులు ఊదరగొట్టారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక తొలి ఏడాది తల్లికి వందనం పథకం అమలు ఎగ్గొట్టారు. గతేడాది జిల్లాలో వేల మంది విద్యార్థులకు ఈ పథకానికి సంబంధించి అర్హత ఉన్నా నేటికి పలురువురు తల్లుల ఖాతాల్లో లబ్ధి జమ చేయకుండా ఎగనామం పెట్టారు. ఈ నేపథ్యంలో తల్లికి వందనం డబ్బులు ఈ ఏడాది తల్లుల ఖాతాల్లో జమ కావడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
స్పష్టత లేదు..
కూటమి సర్కారు తల్లికి వందనం పథకం ప్రకటించిన తొలి ఏడాది 2024లో అమలుకు నోచుకోలేదు. అర్హత ఉన్నప్పటికీ గతేడాది అనేక కారణాలు చూపుతూ జిల్లాలో వందల మందికి కోత పెట్టింది. దీంతో అప్పట్లో తల్లులంతా స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. అధిక విద్యుత్ బిల్లులు, నాలుగు చక్రాల వాహనాలు, లెక్కకు మించి భూములు ఉన్నాయని కారణాలు చూపించారు. అర్హత ఉన్నా లబ్ధి కోల్పోయిన వారిలో పిల్లల తల్లి స్థానంలో ‘కిల్లో స్వప్న’ అనే మహిళ పేరు అనేక మంది పిల్లలకు నమోదైంది. ఆమె పేరిట ఉన్న ఆస్తులను చూపించి పలువురికి తల్లికి వందనం నిలిపివేశారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామని, నమస్యలు పరిష్కరించుకోవాలని, అర్హత ఉండి లబ్ధి కోల్పోయినట్లు ఏ ఒక్కరు చూపించినా లబ్ధి చేకూరుస్తామని సంబంధిత మంత్రి చెప్పినా అంతా బూటకంగానే సాగింది. తొలివిడత జాబితాలో సొమ్ములు జమకాని విద్యార్థులకు సంబంధించి పలు సమస్యలు చెప్పారు. ఆయా సమస్యలపై సంబంధిత శాఖల నుంచి పరిష్కార పత్రాలు తీసుకుని గ్రామ, వార్డు సచివాలయ అధికారులకు తల్లులంతా అందించారు. ఈ క్రమంలో వారికి ఎలిజిబల్ లిస్టుల్లో పేర్లు వచ్చాయి అన్నారు. అయినా ఫలితం లేకపోవడంతో ఈ ఏడాది ఇంకెన్ని కొర్రీలు పెడతారోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
సరైన వ్యవస్థ లేదు..
ప్రస్తుత సర్కారు జిల్లాలో1,584 పాఠశాలల్లో ద్వారా బోధన పొందుతున్న ప్రతి విద్యార్ధికి రూ.15వేలు అందిస్తామని నమ్మబలికింది. ఈ క్రమంలో 2025 జూన్‌లో 69,600 మంది తల్లులకు సంబంఽధించి లక్షా 8,951 మంది పిల్లలను అర్హులుగా ప్రకటించారు. వారిలో ఒకరికి మించి బిడ్డలున్న తల్లులు 39వేలుగా పేర్కొన్నారు. అయితే పూర్తి స్థాయిలో వారికి లబ్ధి చేకూర్చలేకపోయారు. పథకం వర్తింపులో వస్తున్న సమస్యలను పరిష్కరించేందుకు సరైన వ్యవస్థ లేకుండా పోయింది. పాఠశాలల యాజమాన్యాలు, సచివాలయ సిబ్బంది ఆన్‌లైన్‌లో పిల్లల వివరాలు నమోదు చేయటం వరకే తమ పని అని, సమస్య పరిష్కారం కావడం తమ చేతుల్లో లేదంటూ చేతులెత్తేస్తున్నారు. వైఎస్ జగన్‌మోహనరెడ్డి హయాంలో ఇంట్లో ఒకరికి ఈ పథకం వర్తింప చేసినప్పుడు జిల్లాలో దాదాపు 85 వేల మందికి లబ్ధి అందించినట్లు రికార్డులు చెబుతున్నాయి. అప్పట్లో పథకం అందలేదన్న సమస్య తలెత్తకపోవడం పారదర్శకతకు నిదర్శనం. తాజా ఏడాది 2026కి సంబంధించి 15 మండలాల పరిధిలో లక్షా 18వేల పై చిలుకు విద్యార్థులు బోధన పొందుతున్నట్లు విద్యా శాఖ పేర్కొంటోంది. వారి పూర్తి వివరాలను ఈ నెల 15 నాటికి యూడైస్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం సూచించడంతో పాఠశాలల యాజమాన్యాలు ఆ పనిలో నిమగ్నమయ్యాయి. లెక్క ప్రకారం ఈ ఏడాది జూన్‌లో అందించనున్న లబ్ధితో పాటు గతంలో అర్హత కోల్పోయి, శాంక్షన్ లిస్టులో తమ పేర్లు ఉన్నందున బకాయి మొత్తం కలిపి నగదు జమ చేయాలంటూ పలువురు తల్లులు కోరుతున్నారు. అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి ‘తల్లికి వందనం’ అందుతుందా..? లేక గతంలో మాదిరి కొర్రీలు పెడతారా అన్న అనుమానాలు నెలకొన్నాయి. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి ఎత్తుగడలు వేస్తుందో అనే చర్చ జరుగుతోంది. గతంలో ఏర్పడ్డ లోపాలు, సాంకేతిక సమస్యలు అధిగమించి అర్హత ఉన్న ప్రతి విద్యార్థికీ లబ్ధి అందించాలని పిల్లల తల్లులు కోరుతున్నారు.
గత ఏడాది వేలమందికి ఎగనామం
నేటికీ కొంతమంది తల్లులకు జమకాని లబ్ధి
నాడు పలుమార్లు అర్జీలు ఇచ్చినా ఫలితం శూన్యం
వచ్చే నెలలో మలివిడత తల్లికి వందన కార్యక్రమం
శతశాతం అర్హులకు నిధుల జమపై
తొలగని సందేహాలు
ఈనెల 15 నాటికి పిల్లల వివరాల
నమోదుకు ఆదేశాలు


