ఎడారిలా నాగావళి | - | Sakshi
Sakshi News home page

ఎడారిలా నాగావళి

May 11 2026 8:44 AM | Updated on May 11 2026 8:44 AM

రేగిడి: మండలంలోని సంకిలి వద్ద ఉన్న నాగావళి నది నీరులేక ఎడారిని తలపిస్తోంది. వేసవి ఎండల ప్రభావంతో నదిలో గతంలో వచ్చిన కొద్దిపాటి నీరు కూడా పూర్తిగారాని పరిస్థితి ఏర్పడింది. దీంతో నదీపరీవాహక గ్రామాలైన సంకిలి, బొడ్డవలస, పుర్లి, కొమెర, వెంకటాపురం, ఖండ్యాం తదితర గ్రామాల్లో భూగర్బజలాలు అడుగంటాయి. దీంతో ఆయా గ్రామాల్లో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు తప్పవేమోనని ఆందోళన చెందుతున్నారు.

బాలేరులో ఏనుగుల

విధ్వంసం

భామిని: మండలంలోని బాలేరులో నాలుగు ఏనుగుల గుంపు ఆదివారం విధ్వంసం సృష్టించింది. కోత దశలో ఉన్న వరిచేను పొలాల్లో తిరుగాడుతూ పంటను నాశనం వేశాయి. రైతుల పొలాల్లోని బోర్‌వెల్స్‌ పైపులను విరగ్గొట్టి వాటిలోని నీటిని తాగాయి. బాలేరుకు చెందిన ఎర్నాగుల అప్పారావు 5 హెచ్‌పీ బోరును పాడు చేశాయి. పొలాల్లో తిరుగాడుతూ వరి పంటను ధ్వంసం చేశాయి. ఏనుగుల ప్రయాణం మారడంతో స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టాలను లెక్కించాలని కోరుతున్నారు.

న్యాయమూర్తుల గృహ

సముదాయనికి భూమి పూజ

విజయనగరం లీగల్‌: జిల్లా కేంద్ర న్యాయమూర్తుల గృహ సముదాయనికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్‌, జస్టిస్‌ తర్లాడ రాజశేఖర్‌ రావు ఆదివారం భూమి పూజ నిర్వహించారు. స్థానిక వీటీ అగ్రహారంలో ఉన్న పాత జిల్లా కోర్టు ప్రాంగణంలో శిథిలావస్థలో వున్న భవన సముదాయాన్ని తొలగించి వాటి స్థానంలో కొత్త సముదాయాన్ని నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జస్టిస్‌లతో పాటు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత, స్థానిక న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు నళితం రమేష్‌ కుమార్‌, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు బెల్లాన రవి ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

కార్డన్‌ సెర్చ్‌లో

80 వాహనాలు సీజ్‌

విజయనగరం క్రైమ్‌: స్థానిక డబుల్‌ కాలనీలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఆపరేషన్‌ వజ్ర ప్రహార్‌లో భాగంగా డ్రగ్స్‌ నిర్మూలన, నేరాల నియంత్రణ లక్ష్యంగా చేపట్టిన ఈ తనిఖీల్లో 100 మంది పోలీసులు బృందాలుగా ఏర్పడి కాలనీలోని 120 ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. అపరిచిత, అనుమానాస్పద వ్యక్తులు, సారా, అక్రమ మద్యం నిల్వలు, మాదకద్రవ్యాలు, నాటు తుపాకులు, అక్రమ వాహనాలు ఉన్నవీ లేనివీ క్షుణ్నంగా తనిఖీ చేశారు. కొత్త వ్యక్తుల వివరాలు సేకరించి, వారి వేలిముద్రలను ఎంఎస్‌సీడీ పరికరంతో తనిఖీ చేశారు. ఈ సోదాల్లో వాహన ధ్రువపత్రాలు సక్రమంగా లేని 80 వాహనాలను సీజ్‌ చేసి, స్టేషన్‌కు తరలించినట్లు విజయనగరం రెండో పట్టణ సీఐ టి.శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రామారావు, కృష్ణమూర్తి, కనకరాజు, కానిస్టేబుళ్లు నాగమణి, సంధ్య, రజియా తదితరులు పాల్గొన్నారు.

నూతన కార్యవర్గం ఎన్నిక

విజయనగరం టౌన్‌: స్థానిక కేఎల్‌ పురం గురుద్వార వద్ద జై జులేలాల్‌ సింద్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం జరిగింది. అధ్యక్షుడిగా లక్ష్మీచంద్‌ లాల్వానీ, ఉపాధ్యక్షుడిగా శశి కుక్రేజా, కార్యదర్శిగా హరేష్‌ లాల్వానీ, సహాయ కార్యదర్శిగా రామ్‌లాల్‌ లాల్వానీ, కోశాధికారిగా కె.రాజేంద్ర ఎన్నికయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement