పెళ్లింట విషాదం | - | Sakshi
Sakshi News home page

పెళ్లింట విషాదం

May 11 2026 8:44 AM | Updated on May 11 2026 8:44 AM

పెళ్లింట విషాదం

లారీ, ఆటో ఢీకొని ఇద్దరి మృతి

ముగ్గురికి తీవ్ర గాయాలు

ఒకరి పరిస్ధితి విషమం

జామి: పెళ్లింట బంధువులు, మిత్రులు అంతా సరదాగా గడిపారు. పెళ్లి కూడా సందడిగా జరిగిపోయింది. బంధువులు ఎవరింటికి వారు తిరిగి ప్రయాణమయ్యారు. ఇంతలోనే విషాదవార్త వినవలసి వచ్చింది. మరో పదినిమిషాల్లో స్వగ్రామం చేరుకుంటారనగా లారీ రూపంలో వారిని మృత్యువు కాటేసింది. దీంతో పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. పాచిపెంట మండలంలోని తోటవలస గ్రామంలో ఆడపిల్ల ఇంటివద్ద వివాహం జరిగింది. వివాహమైన తరువాత ఆదివారం పెండ్లి కుమారుడి తండ్రి మట్టా సన్యాసిరావు, తల్లి కనకమ్మ, వరుసకు పెళ్లి కుమార్తె చిన్నాన్న విజయనగరం మండలం చాకలిసేటకు లావేటి పైడిరాజు, పిన్ని గౌరమ్మ, బంధువులు ఆటోలో తిరిగి పెండ్లికుమారుడి స్వగ్రామం జామి మండలంలోని అన్నంరాజు పేట గ్రామానికి ఆటోలో తిరిగి పయనమయ్యారు. ఈ క్రమంలో జామి మండలంలోని జన్నివలస వద్ద విశాఖ గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై పాచిపెంటనుంచి వస్తున్న ఆటోను జామి నుంచి విజయనగరం వెళ్తున్న లారీకి టైర్‌ పంక్చరై అదుపు తప్పి ఆటోను ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న పెళ్లికొడుకు తండ్రి మట్టా సన్యాసిరావు(62), అక్కడికక్కడే మృతిచెందాడు. పెళ్లికుమార్తెకు వరుసకు చిన్నాన్న లావేటి పైడిరాజు(52), పెండ్లి కుమారుడి తల్లి కనకమ్మ, బంధువులు ఒకే కుటుంబానికి చెందిన మడ్డు రాఘువ, వట్టి సాయి కుమార్‌ తీవ్ర గాయాల పాలయ్యారు. వారిని 108 వాహనంలో విజయనగరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ లావేటి పైడిరాజు మృతిచెందాడు. కనకమ్మ పరిస్థితి విషమంగా ఉంది. గాయాలపాలైన మిగిలిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జామి ఎస్సై వీర జనార్దన్‌ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి జరిగిన ఘటనపై తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement