చంద్రబాబు అలా.. స్థానిక నాయకులు ఇలా!
సాక్షి, పార్వతీపురం మన్యం: రెవెన్యూ యంత్రాంగం తీరుపై అధికార పార్టీ నేతలు మరోసారి విరుచుకుపడ్డారు. ఆక్రమణలు అడ్డుకోవడం లేదని చెబుతూనే.. ఆక్రమణదారులకు సహకరిస్తున్నారా? అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కలెక్టర్, జేసీ, సబ్ కలెక్టర్ వంటి ఐఏఎస్ అధికారులనే లక్ష్యంగా చేసుకొని మాటల దాడికి దిగడం, ఆరోపణలు గుప్పించడం ఉద్యోగ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇదే సందర్భంలో మొత్తం రెవెన్యూ వ్యవస్థనే తూలనాడటం పట్ల ఆ శాఖ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే కలెక్టర్ ప్రభాకరరెడ్డికి వ్యతిరేకంగా అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఏకమైన విషయం విదితమే. ఆయనను జిల్లా నుంచి పంపించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారన్న ప్రచారం సాగింది. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే బాహాటంగానే కలెక్టర్, జేసీ వంటి అధికారుల పట్ల విమర్శలు చేయడం.. ఈ అనుమానాలకు మరింత బలమిచ్చినట్లు అయ్యింది.
కళ్లు మూసుకున్నారా.. అంటూ ఆగ్రహం!
పార్వతీపురం మండలం అడ్డాపుశీల రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 70/2 లో గల సుమారు మూడున్నర ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని బంటువానివలస గ్రామానికి చెందిన బంటు దాసు అనే వ్యక్తి ఆక్రమించి, ప్రైవేటు వ్యక్తులకు ఇటుకల తయారీకి లీజుకు ఇచ్చారని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర తెలిపారు. దీనిపై రెవెన్యూ అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం అడ్డాపుశీల గ్రామ సమీపంలో బంటు దాసు ఆక్రమించిన స్థలంగా చెబుతున్న ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే విజయ్ చంద్ర పరిశీలించారు. ఇటుకల తయారు చేసే ప్రదేశంతోపాటు.. సమీపంలో వెల్డింగ్ షాప్, ఇతర దుకాణాల వద్దకు వెళ్లి, అక్కడున్న నిర్వాహకులతో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 5 సంవత్సరాల నుంచి బంటు దాసు అనే వ్యక్తి ఈ స్థలాన్ని ఇటుకల తయారీకి లీజుకు ఇచ్చారని చెప్పారు. ప్రతినెలా రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు లీజు సొమ్మును వసూలు చేస్తున్నారన్నారు. ఒక ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తి ఆక్రమించి ఎలా లీజుకు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై సాక్షాత్తు ఇన్‌చార్జి మంత్రి దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్లకు తన లెటర్‌పై లిఖితపూర్వక ఫిర్యాదు చేశానని చెప్పారు. ఇటీవల తాను, కలెక్టర్ ఇటువైపు వచ్చిన సమయంలో ఇక్కడ ఆగి ఈ స్థలాన్ని పరిశీలించామని తెలిపారు. దీనికి ఏమైనా అనుమతులు ఇచ్చారా? అని కలెక్టర్‌ను ప్రశ్నించినట్లు చెప్పారు. ఈ విషయం కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలు అవుతుందని.. రెవెన్యూ ప్రిన్సిపల్ కార్యదర్శి జయలక్ష్మికి కూడా ఫిర్యాదు చేశానన్నారు. అసెంబ్లీ సాక్షిగా తాను చెరువుల కబ్జాపైన, ప్రభుత్వ స్థలాల ఆక్రమణపైన ప్రస్తావించానన్నారు. ప్రభుత్వ స్థలాల్లో లే అవుట్‌లు కూడా వేశారని.. దీనిపై ఎటువంటి చర్యలూ లేవన్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ జరగని రెవెన్యూ స్థలాల ఆక్రమణలు, కబ్జాలు ఇక్కడే ఉన్నాయని, ఇది దురదృష్టకరమని అన్నారు. బంటు దాసు ఆక్రమించిన ప్రభుత్వ స్థలం విషయంపై అనేకసార్లు రెవెన్యూ అధికారులకు తెలియజేసినా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి రెవెన్యూ యంత్రాంగం వరకు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు నెలలుగా ప్రతిరోజూ ఒక రెవెన్యూ సమస్యపై రెవెన్యూ యంత్రాంగానికి తెలియజేస్తూనే ఉన్నానని, ఆక్రమణ గురైన స్థలం రెవెన్యూ రికార్డులో ఉందని చెప్పినా పట్టించుకోకపోవడం సరికాదన్నారు. బంటు దాసు అనే వ్యక్తి సీపీఎం ముసుగులో ఉన్నారని విమర్శించారు. కలెక్టర్, జేసీ, సబ్ కలెక్టర్లు దాసును చూసి భయపడ్డారా? లేక గత వైఎస్సార్‌సీపీని చూసి భయపడుతున్నారా? అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
రెండు రోజుల సమయం.. అల్టిమేటం
రెండు రోజులు సమయం ఇస్తున్నామని.. జిల్లా అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ అధికారులు దీన్ని ప్రభుత్వ స్థలంగా పరిగణనలోకి తీసుకోవాలని, లేకుంటే తానే స్వయంగా బోర్డు వేయించాల్సి వస్తుందని ఎమ్మెల్యే హెచ్చరించారు. ప్రతినెలా ప్రభుత్వ స్థలంపై ఒక ప్రైవేటు వ్యక్తి రూ.వేలకు వేలు లీజు వసూలు చేస్తుంటే రెవెన్యూ యంత్రాంగం కళ్లు మూసుకొని వ్యవహరించడం సరైన పద్ధతి కాదని, దీనిపై రెవెన్యూ జిల్లా యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూస్తానని అన్నారు. ఇదే బంటు దాసుకు చెందిన స్థలంలో రెవెన్యూ, పోలీసు అధికారులను తీసుకుని వెళ్లి, ఆక్రమణ స్థలం అంటూ ఎమ్మెల్యే స్వయంగా అక్కడున్న ప్రహరీని కూల్చివేయడం గమనార్హం.
జిల్లా కలెక్టర్ ప్రభాకరరెడ్డి పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెచ్చుకుంటున్నారు. ముస్తాబు, రెవెన్యూ క్లినిక్ వంటి వాటిని ప్రశంసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ఆదేశించారు. ముస్తాబు కార్యక్రమానికి మెంటార్‌గా జిల్లా కలెక్టర్‌ను నియమించారు. స్వయంగా కలెక్టర్ల సదస్సులోనే ప్రభాకరరెడ్డి పనితీరు పట్ల సీఎం ప్రశంసిస్తుంటే... జిల్లాలో అందుకు విరుద్ధంగా నిందలు వేయడంపై ఉద్యోగ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.


