సాక్షి ప్రతినిధి విజయనగరం: రెవెన్యూ శాఖలో చిత్రమైన పరిస్థితి నెలకొంది. విజయనగరం నియోజకవర్గ జనాభా పెరగడంతో రెవెన్యూ సేవలు సకాలంలో అందడంలేదన్న ఉద్దేశంతో విజయనగరం రెవెన్యూ కార్యాలయాన్ని అర్బన్, మండల తహసీల్దార్ కార్యాలయాలుగా ఇటీవల విభజించారు. దీంతో ప్రజలు కూడా సంతోషించారు. ఇద్దరు అధికారులు ఉంటారని, చకచకా పనులు జరుగుతాయని, నాణ్యమైన రెవెన్యూ సేవలు అందుతాయని ఆశపడ్డారు. తీరా రెండు కార్యాలయాలకు ఒకే తహసీల్దార్‌ను నియమించడంతో ఉసూరుమంటున్నారు. విభజించడం వల్ల ప్రయోజనం ఏముందని నిట్టూర్చుతున్నారు. చెప్పుకునేందుకే రూరల్, అర్బన్ అంటూ రెండు తహసీల్దార్ కార్యాలయాలని, ఇద్దరు తహసీల్దార్లను నియమించాల్సిన చోట ఒక్కరినే నియమించడంపై అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న తహసీల్దార్ మీద గతంలో ఆరోపణలు.. ఫిర్యాదులు వెల్లువెత్తగా కొన్నాళ్లు సెలవుపై పంపేశారని, అంతా సద్దుమణిగాక మళ్లీ ఆయనను రెండు కార్యాలయాల బాధ్యతలు అప్పగించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనివెనుక అవినీతి కథ నడుస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కుడిచేత్తో అర్బన్ ఫైళ్ళు, ఎడమచేత్తో రూరల్ ఫైళ్ళు క్లియర్ చేస్తూ రెండు చేతులా ప్రజలకు సేవలు అందిస్తారంటూ కొందరు ఎద్దేవా చేస్తున్నారు.


