వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం

May 10 2026 8:04 AM | Updated on May 10 2026 8:04 AM

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం మద్యం మత్తులో.. యువకుడు.. సత్తెనపల్లి వద్ద జిల్లా యువకుడు..

రోడ్డు ప్రమాదంలో సైక్లిస్ట్‌..

జామి: మండల కేంద్రమైన జామిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక సైక్లిస్ట్‌ దుర్మరణం పాలైన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. జామి గ్రామానికి చెందిన బీల అచ్చన్న(54) పొలం పని చేసుకుని తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో స్థానిక వినాయక గుడి వద్ద ఎస్‌.కోట నుంచి విజయనగరం వైపు వస్తున్న లారీ సైక్లిస్ట్‌ను ఢీకొనడంతో లారీ వెనుక భాగాన టైర్లు కింద పడి దుర్మరణం పాలయ్యాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ వీర జనార్ధన్‌ ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్‌.కోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య కనకమ్మ, ఒక కుమార్తె ఉన్నారు.

పాలకొండ రూరల్‌: సీతంపేట రహదారిలో పట్టణ శివారున ప్రధాన రహదారికి పక్కన ఓ వ్యక్తి మృతదేహాన్ని అక్కడి స్థానికులు గుర్తించారు. ఒంటిపై పూర్తి స్థాయి బట్టలు లేకుండా ఉండటంతో తొలిత పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇంతలో అతను పట్టణంలో గల ఎన్‌ఎస్‌ఎన్‌ కాలనీకి చెందిన బుడ్డి(55)గా గుర్తించారు. ఈయన గత కొద్ది రోజులుగా మానసికంగా ఇబ్బందులు పడుతూ, మద్యానికి బానిసై తిరుగుతున్నట్టు తేలింది. ఈ కోవలో మరణించి ఉంటారని భావించి స్థానికులు వారి బంధువులకు సమాచారం అందించారు. వారి బంధువులు వచ్చి మృతదేహాన్ని తరలించారు. దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

భామిని: మండలంలోని బత్తిలికి చెందిన యువకుడు కోట చంటి (29) శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. బత్తిలికి చెందిన మీసాల సమీర్‌తో కలిసి బుల్లెట్‌ బైక్‌పై కోట చంటి కొత్తూరు వైపు వెళ్తుండగా ఘనసర వద్ద ఏబీ రోడ్డుపై ప్రమాదానికి గురై మృతి చెందాడని బత్తిలి ఎస్‌ఐ కె.రవీంద్ర తెలిపారు. బైక్‌ డ్రైవ్‌ చేస్తున్న సమీర్‌ ఈ ప్రమాదంలో చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు. బైక్‌పై వెళ్తున్న వీరికి ఘనసర వద్ద ఎదురుగా వ్యాన్‌ వచ్చింది. వ్యాన్‌కు దారిచ్చేందుకు బైక్‌ను సడన్‌ బ్రేక్‌ వేయగా చంటి తుళ్లి కిందకు పడిపోయాడు. ఈ ప్రమాదంలో చంటి తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. దీంతో ప్రమాద స్థలంలోనే చంటి మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. బత్తిలి ఎస్‌ఐ రవీంద్ర కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

సీతానగరం: మండలంలోని కృష్ణారాయపురం గ్రామానికి చెందిన గుణుపూరు అచ్చుతరావు(26) సత్తెనపల్లి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే... అచ్చుతరావు డిప్లమా ఇంజినీరింగ్‌ చదివి ఉద్యోగం నిమిత్తం ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్‌ వెళ్లి ఓ ప్రైవేటు కంపెనీలో ఉపాధి చూసుకున్నాడు. హైదరాబాద్‌లోని బొల్లారంలో నివాసం ఉంటూ శుక్రవారం హైదరాబాద్‌ నుంచి మోటారుసైకిల్‌పై కాకినాడ వస్తుండగా సత్తెనపల్లి సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన అచ్చుతరావును సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి వద్ద ఆధార్‌ కార్డు ఆధారంగా పోలీసులు శనివారం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చేతికందొచ్చిన కొడుకు ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు గంగమ్మ, భాస్కరరావు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement