రాజాం: మున్సిపాల్టీ పరిధి వస్త్రపురి కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల స్థలాన్ని రాజాం మండలం నర్సింహపురం గ్రామానికి చెందిన పి.వెంటరమణ అనే వ్యక్తి ఆక్రమిస్తున్నాడంటూ స్థానికులు శనివారం పాఠశాల ఆవరణలో ఆందోళనకు దిగారు. అనంతరం ప్రధాన రహదారిపై ర్యాలీ చేపట్టారు. సర్వే నంబరు 59లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు 196 అడుగుల వెడల్పు, 216అడుగుల పొడవుల విస్తీర్ణంపై మైదానం ఉందని తెలిపారు. ఈ మైదానాన్ని ఎటువంటి హక్కులు లేకుండా వెంకటరమణ ఆక్రమణ చేస్తూ, ప్రహరీ నిర్మించాడని గ్రామస్తులు ఆరోపించారు. కమలనాయుడు ఆధ్వర్యంలో వంద మందికి పైగా కాలనీ వాసులు ఆక్రమణలపై మండిపడ్డారు. తహసీల్దార్, ఎంఈఓకు ఫిర్యాదు చేశామని, సోమవారం కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేయనున్నామని వెల్లడించారు. ఆక్రమణలు తొలగించడంతో పాటు ఆక్రమణదారుడుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎంఈఓ దర్యాప్తు
వస్త్రపురి కాలనీలో ప్రభుత్వ పాఠశాల ఆక్రమణలపై ఎంఈఓ యాగాటి దుర్గారావు దర్యాప్తు ప్రారంభించారు. ఉన్నతాధికారులు నుంచి వచ్చిన ఆదేశాలతో పాఠశాల మైదానాన్ని పరిశీలించారు. 5 నుంచి ఆరు అడుగుల వెడల్పు మేర పాఠశాల మైదానంలోకి ఆక్రమణదారుడు వచ్చినట్టుగా గుర్తించారు. పాఠశాల హెచ్‌ఎం రాజుతో పాటు తహసీల్దార్‌కు ఆక్రమణలు తొలగించాలని ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు ఎంఈఓ తెలిపారు.


