విజయనగరం క్రైమ్: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి, ప్రాణాలు కాపాడుకోవాలని విజయనగరం ట్రాఫిక్ సీఐ సూరినాయుడు సూచించారు. నగరంలోని న్యూపూర్ణ జంక్షన్ వద్ద హెల్మెట్ వాడకంపై శనివారం అవగాహన కల్పించారు. బైక్‌లతో రోడ్లపైకి వచ్చేటప్పుడు హెల్మెట్, లైసెన్స్‌లతో పాటు వాహన ధ్రువపత్రాలు కూడా వెంట తెచ్చుకోవాలని తెలిపారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలు పాటించి, రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. చాలామంది ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం వల్లే రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హెల్మెట్ ధరిస్తే మన ప్రాణానికే రక్ష అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. హెల్మెట్ లేకుండా తొలిసారి పట్టుబడితే వదిలేస్తామని, మరోసారి పట్టుబడితే రూ.5 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.


