న్యూస్‌రీల్
సెలవుపై వెళ్లనున్న గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు తీవ్ర ఒత్తిళ్ల మధ్య ఇమడలేక నిర్ణయం! కొన్నాళ్లుగా ఐటీడీఏలో సాగుతున్న అంతర్యుద్ధం ఫలితం గుమ్మలక్ష్మీపురం వార్డెన్ పోస్టుకోసం తీవ్రస్థాయిలో ఒత్తిడి
సాక్షి, పార్వతీపురం మన్యం:
పార్వతీపురం ఐటీడీఏలో గిరిజన సంక్షేమ శాఖ డీడీగా పనిచేస్తున్న విజయశాంతి ఇక్కడ నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. సెలవుపై వెళ్తు న్న ఆమె.. తిరిగి వచ్చేందుకు ఇష్టం చూపడం లేదని తెలుస్తోంది. తన డిప్యుటేషన్‌ను రద్దు చేయాలని ఉన్నతాధికారులకు కోరనున్నట్లు సమాచారం. ఐటీడీఏలో కొన్నాళ్లుగా సాగుతున్న అంతర్యుద్ధం నేపథ్యంలో ఇక్కడ ఇమడలేక, ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఐటీడీఏలో గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులుగా విజయశాంతి కొన్నాళ్ల కిందట డిప్యుటేషన్‌పై పూర్తి అదనపు బాధ్యతలతో ఇక్కడకు వచ్చిన విషయం విదితమే. కొద్దిరోజుల పాటు అంతా సజావుగా సాగినా.. ఆమెను ఇక్కడ కొనసాగించడం ఇష్టం లేక, కొంతమంది తెర వెనుక పావులు కదుపుతూ వస్తున్నారు. తమకున్న రాజకీయ పలుకుబడితో ఆ స్థానంలోకి వచ్చేందుకు కొందరు ఏటీడబ్ల్యూవోలు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో పాలనాపరంగా డీడీకి సహకారం కూడా అందించడం లేదని కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. శాఖలో ఓ వార్డెన్‌తో డీడీకి వ్యతిరేకంగా అప్పటి ఇన్‌చార్జి పీఓ యశ్వంత్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు చేయించారు. పీఓ పేరు చెప్పి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ అప్పట్లో యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో ఆయనను కూడా ఐటీడీఏలోని కొంతమంది తప్పుదోవ పట్టించారని గిరిజన సంఘాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో వార్డెన్ ఏ అంశం మీద ఫిర్యాదు ఇచ్చారన్నది ఏ ఒక్కరూ బయట పెట్టలేదు. ఈ నేపథ్యంలో గిరిజన సంక్షేమ శాఖ ఉద్యోగులతో సమావేశమైన అప్పటి పీఓ.. శాఖలో ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతో ఐటీడీఏ, గిరిజన సంక్షేమ శాఖ విభాగాల్లో పలువురు ఉద్యోగుల స్థానాలను మార్పు చేశారు. కొత్తగా విభాగానికి సంబంధం లేని ఉద్యోగులను తమకు అప్పగించడం వల్ల పరిపాలనాపరంగా ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన డీడీ.. ఉద్యోగులను రిలీవ్ చేసేందుకు విముఖత చూపారు. దీంతో ఆమెకు అప్పటి పీఓ షోకాజ్ నోటీసు జారీ చేశారు. అనంతరం పీఓగా ఆర్.వైశాలి బాధ్యతలు స్వీకరించడంతో ఉద్యోగుల స్థానచలనం వివాదం సద్దుమణిగిందనే అంతా భావించారు. అనూహ్యంగా ఈ విషయాన్ని పీఓ వైశాలి మళ్లీ తెరపైకి తెచ్చారు.


