గుమ్మలక్ష్మీపురం: మండలంలోని దొరజమ్ము ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఎన్.ఆశ్రయ్య (14) విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్సపొందుతూ శుక్రవారం మృతి చెందాడు. పాములగీసాడ గ్రామానికి చెందిన ఆశ్రయ్యకు గురువారం కడుపునొప్పి వచ్చింది. తల్లిదండ్రులు వెంటనే రేగిడి పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ తగ్గక పోవడంతో కురుపాం సీహెచ్‌సీకి, అక్కడి నుంచి పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి, మరింత మెరుగైన వైద్యంకోసం విశాఖపట్నం కేజీహెచ్ కు తరలించినా ఫలితం లేకపోయింది. విద్యార్థి ఊపిరితిత్తులు ఇన్‌ఫెక్షన్ కావడంతో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారని ఏటీడబ్ల్యూఓ ఎల్.రజని తెలిపారు. అందివచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుపెడుతున్నారు.
జియ్యమ్మవలస రూరల్: ఇప్పటికే గాలివానల కు సుమారు 165 ఎకరాలకు పైబడి అరటి పంట నష్టం వాటిల్లిన కుదమ రైతులకు ఏనుగులు గుంపురాకతో బెంగపట్టుకుంది. ఉన్నకాస్త అర టి పంటను నష్ట పరుస్తాయని ఆందోళన చెందుతున్నారు. గజరాజులను శాశ్వతంగా తరలింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ప్రతి ఒక్కరూ సేవాగుణాన్ని అలవర్చుకోవాలి
● రెడ్‌క్రాస్ చైర్మన్ ప్రసాదరావు
విజయనగరం ఫోర్ట్: ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ ప్రసాదరావు కోరారు. రెడ్‌క్రాస్ సొసైటీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సీతం ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో రెడ్‌క్రాస్ సొసైటీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రక్తదాతలను అభినందించారు. కార్యక్రమంలో సీతం కళాశాల డైరెక్టర్ మజ్జి శశిభూషణరావు, ఎన్‌సీపీ కెప్టెన్ సత్యవేణి, ఎన్‌సీసీ లెఫ్ట్‌నెంట్ ఉదయ్‌కిరణ్, డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం: విజయనగరం జిల్లా స్థాయి అండర్–13 చెస్ పోటీల్లో చిన్నారులు తమ మేధస్సుకు పదునుపెట్టారు. ఎత్తుకు పై ఎత్తులు వేసి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. విజయనగరం చెస్ అకాడమీలో శుక్రవారం జరిగిన ఎంపిక పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఓపెన్ విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన శ్రీమన్, నారాయణ సాహూ, అమండు, జిగ్నేష్, బాలికల విభాగంలో ఎజ్జురోతు పరిణిత, భావన రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఎంపిక ప్రక్రియకు కె.వి.జ్వాలాముఖి, ఎ.హేమబిందు, ఆసిఫ్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.


