న్యూస్‌రీల్
సీతానగరం:
ఒడిశా సరిహద్దులోని పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలను ఏనుగుల భయం కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట పంటలకు, రైతుల ఆస్తులకు ఏనుగులు నష్టం కలిగిస్తున్నాయి. పంట పొలాలు, రోడ్లపై సంచరిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఎదురుగా వచ్చేవారి ప్రాణాలు తీస్తున్నాయి. ఆస్తులను ధ్వంసం చేస్తున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదాన్ని తలపెడుతాయోనన్న భయంతో పల్లె ప్రజలు బతుకుతున్నారు. కుంకీ ఏనుగులను తీసుకొచ్చి ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామంటూ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ప్రకటనలు ఆచరణ శూన్యంగానే కనిపిస్తున్నాయి. అధికారం చేపట్టి రెండేళ్లవుతున్నా ఆ దిశగా చర్యలు కనిపించడం లేదు.
ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలంటూ ఈ ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఏనుగుల సమస్యపై ప్రతివారం కలెక్టరేట్‌లో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌లో వినతులు అందజేస్తున్నారు. ఆరుగా లం శ్రమించి సాగుచేసిన పంటలను ఏనుగులు నష్టపరుస్తున్నాయని, పెట్టుబడి కూడా రావడం లేదని, ఆదుకోవాలంటూ విన్నవిస్తున్నారు. దీనిపై స్పందించిన జిల్లా యంత్రాంగం గుచ్చిమి బీట్‌లోని కంపార్ట్‌మెంట్ నంబర్ 195, 196 పరిధిలో సుమా రు 50 హెక్టార్ల విస్తీర్ణంలో తాత్కాలిక ఏనుగుల సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. అటవీశాఖ అధికారుల పర్యవేక్షణలో సుమారు రూ.3 కోట్ల ఖర్చుతో పనులు జరుగుతున్నాయి. అయితే, ప్రభుత్వం స్పందించి చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతంలో ఉన్న కుంకీ ఏనుగులను రప్పిస్తే తప్ప ఈ ప్రాంతంలోని ఏనుగులను సంరక్షణ కేంద్రానికి తరలించడం సాధ్యం కాదన్న వాదన అధికార వర్గాల నుంచి వినిపిస్తోంది.
వివిధ ప్రమాదాల్లో ఓ వైపు 9 ఏనుగులు మరణించాయి. మరోవైపు 14 మందిని ఏనుగులు పొట్టనపెట్టుకున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలి యని భయం. అటవీశాఖ సిబ్బంది ప్రజలను అప్రమత్తం చేస్తున్నా అమాయకులైన గిరిజనులు ఏనుగులకు తారసపడి బలవుతున్నారు. ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రజలను ఓదార్చుతున్న ప్రభుత్వాలు తర్వాత మిన్నకుంటున్నాయి. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలేదన్న విమర్శ లు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నిక ల సమయంలో హామీ ఇచ్చినా, డిప్యూటీ సీఎం స్వయంగా సమస్యపై పలు సార్లు ప్రస్తావించినా చర్యలు మాత్రం శూన్యంగా కనిపించడం గిరిజనులను ఆవేదనకు గురిచేస్తున్నాయి.
గుచ్చిమి వద్ద చేపట్టిన తాత్కాలిక ఏనుగుల సంరక్షణ కేంద్రంలో ఏనుగులను బంధించేందుకు వీలు గా అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నా యి. కందకాలు, సోలార్ హ్యాంగింగ్ ఫెన్సింగ్, పట్టుబడిన ఏనుగులకోసం ప్రత్యేకంగా ఎలిఫెంట్ షెడ్లు, వాటర్‌టబ్‌లు, స్నానపుకొలనులు నిర్మిస్తున్నారు. కుంకీ ఏనుగులకు శిక్షణ ఇచ్చే మావటీల కోసం ప్రత్యేక క్వార్టర్లు, కిచెన్ షెడ్, ఏనుగుల ఆరోగ్య సంరక్షణ కోసం అత్యాధునిక వెటర్నరీ కేర్ సెంటర్(వైద్య కేంద్రం), నీటి తొట్టెలు, అటవీ ప్రాంతం లోపలికి సులభంగా చేరుకోవడానికి రోడ్లు నిర్మిస్తున్నారు. ఈ కేంద్రం ఎప్పుడు అందుబాటులోకి వస్తే అప్పుడు సమస్యకు పరిష్కారం లభిస్తుందని గిరిజనులు ఆశగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఖరీఫ్ నాటికైనా ఏనుగుల తరలింపు ప్రక్రియను పూర్తిచేయాలని కోరుతున్నారు.


