బొబ్బిలి: విశాఖపట్నం రైల్వేజోన్ ప్రకటించి ఏళ్లు గడుస్తుండగా.. ఇప్పుడు కొత్తగా కిరండోల్ రైల్వేలైన్ తప్పించి విశాఖ రైల్వే జోన్ ప్రకటించడం దారుణమని ఉత్తరాంధ్ర సాధన సమితి వ్యవస్థాపక కన్వీనర్ వేమిరెడ్డి లక్ష్మునాయుడు అన్నారు. బొబ్బిలిలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఉన్న వాల్తేరు డివిజన్‌నే విశాఖ డివిజన్ అనిపేరు పెట్టారు తప్ప అధికాదాయం ఉన్నప్రాంతాలను మాత్రం ఎక్కడో దూరాన ఉన్న రాయగడ డివిజన్‌లో కలపడం అన్యాయమన్నారు. కొత్తవలస–కిరండోల్ రైల్వేలైన్ వల్ల ఏటా రూ.3వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు. రాష్ట్ర విభజన తరువాత అటువంటి ఆదాయ వనరును ఏపీకి అన్వయించాలే తప్ప వేరే రాష్ట్రానికి బదలాయించి ఏపీకి తీరని నష్టాన్ని మిగిల్చారన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం దీనిపై నోరు విప్పకవడం విచారకరమన్నారు. ఇది రాష్ట్రప్రజలను మోసం చేయడమేనన్నారు. విశాఖ రైల్వే జోన్ మంజూరు జరిగిన నాటి నుంచి రైల్వే ఉద్యోగులు, ప్రజానీకం కేకే లైన్‌ను విశాఖ జోన్‌లోనే ఉంచాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కేకే లైన్ ను తప్పించి విశాఖనుజోన్‌గా ప్రకటించడం ఏపీపై కేంద్రానికి ఉన్న ఆలోచన ఎలాంటిదో తెలుస్తోందన్నారు. కార్యక్రమంలో వజ్జి రవికుమార్, తమ్మిరెడ్డి కృష్ణ, చుక్క కూర్మినాయుడు పాల్గొన్నారు.


