పార్వతీపురం: జిల్లాలో స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం అమలుపై జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి గురువారం తన చాంబర్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణాల్లో ఇంటింటి చెత్త సేకరణ, తడి–పొడి చెత్త వేరుచేయడం, ప్లాస్టిక్ నియంత్రణ, డ్రైనేజీల పరిశుభ్రత, దోమల నివారణ చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. ప్రధాన రహదారులు, మార్కెట్ ప్రాంతాలు, బస్టాండ్‌లు తదితర రద్దీ ప్రదేశాల్లో ప్రతిరోజూ శుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానం సాధించేందుకు ప్రతి మున్సిపాల్టీ కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. సమావేశంలో పార్వతీపురం, సాలూరు, పాలకొండ, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖాధికారులు పాల్గొన్నారు.
40 లీటర్ల సారా పట్టివేత
సీతంపేట: మండలంలోని మండ గ్రామంలో 40 లీటర్ల సారా పట్టుకున్నట్లు ఎస్సై వై.అమ్మన్నరావు తెలిపారు. సారాతో పాటు సవర జగ్గయ్య అనే పేర్లు గల ఇద్దరు నిందితులను అరెస్టు చేశామన్నారు. సారా వండినా, విక్రయించినా, అక్రమరవాణా చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
గజపతినగరం/దత్తిరాజేరు: పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన దత్తిరాజేరు మండలం ఎం.లింగాలవలస గ్రామానికి చెందిన మజ్జి ఈశ్వరరావు వైద్యసేవలు పొందుతూ మృతి చెందాడని గజపతినగరం ఎస్సై కె.కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వివరాలు తెలిపారు. ఈశ్వర రావు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అప్పులు చేసి నష్టాల బాట పట్టడంతో అప్పుల బాధ భరించలేక మనస్తాపానికి గురై ఈనెల 5వ తేదీన సాయంత్రం గజపతినగరం మండలం దావాలపేట రోడ్డు మహంకాళి అమ్మవారి గుడి సమీపంలో ఉన్న శ్మశాన వాటికలో పురుగు మందు తాగాడన్నారు. అనంతరం తన స్నేహితుడు రామకృష్ణ గజపతినగరం ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో చేర్పించి వైద్యసేవలు అందించాడని తెలిపారు. మెరుగైన వైద్యం కోసం విజయనగరంలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతిచెందినట్లు ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
రైలు నుంచి జారిపడి
యువకుడి మృతి
గరుగుబిల్లి: మండలంలోని రావుపల్లి గ్రామానికి చెందిన పల్ల అప్పలనాయుడు(25) రైలు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. బతుకు తెరువు నిమిత్తం విశాఖపట్నంలో వెల్డర్‌గా పనిచేస్తున్న అప్పలనాయుడు బుధవారం విశాఖపట్నం నుంచి భవానీపట్నం వెళ్తున్న రైలులో అమ్మను చూసేందుకు వస్తున్న తరుణంలో మానాపురం–గజపతినగరం మధ్య ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతి చెందాడు.
అప్పలనాయుడు మృతితో రావుపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొన్నేళ్ల క్రితం తండ్రి పరిసనాయుడు అనారోగ్యంతో మృతిచెందగా, ప్రస్తుతం తల్లి సావిత్రమ్మకు ఆయనే పెద్ద దిక్కుగా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుమారుడి మృతివార్త తెలుసుకున్న తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుడికి విజయనగరంలోని జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసి రావుపల్లిలో అంత్యక్రియలను గురువారం నిర్వహించారు.


