● మెడికల్ విద్యార్థి ఆవేదన
● కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు
విజయనగరం క్రైమ్: నర్సింగ్ చదువుతున్న ఓ విద్యార్థి క్యాష్కో యాప్‌కు దాసోహమై అప్పుల పాలై చివరకు ఆత్మ హత్యే శరణ్యమనుకున్నాడు. కానీ కన్నవారి ఆశయాలు ఆ విద్యార్థిని అల్లంత వరకు లాక్కెళ్లి వెనక్కు రప్పించాయి. తనకున్న ఆగమ్య గోచర పరిస్థితికి పోలీసులు సమాధానం చెబుతారేమోనని సరాసరి విజయనగరం టూటౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన ఆడారి చాతుర్య విజయనగరం మిమ్స్‌లో మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఫోన్‌లో క్యాష్యో బెట్టింగ్ యాప్‌లో పూర్తిగా మునిగిన చాతుర్య దాదాపు రూ. 6లక్షల వరకు అప్పులు చేశాడు. చాతుర్య తండ్రి ఒక సాదాసీదా లైన్‌మన్. కొడుకు చదువుకోసం ప్రతినెలా దాదాపు రూ. 20వేల వరకు డబ్బులు పంపుతూనే ఉన్నారు. ఎక్కడో దూరంలో ఉన్న కొడుకు చదివి వృద్ధిలోకి వచ్చి తమను చరమాంకంలో ఆదుకుంటాడనే నమ్మకంతో తల్లిదండ్రులు ఉన్నారు. కానీ చదువు కోసం దూరాభారం వచ్చి విజయనగరంలోని పూల్‌బాగ్‌లో రూమ్ తీసుకుని మిమ్స్‌లో చదువుతున్న చాతుర్య క్యాష్యో యాప్‌కు బానిసై దాదాపు రూ.6లక్షల వరకు అప్పులు చేశాడు. చివరకు యాప్ ద్వారా రాబడి రాకపోవడంతో చావే శరణ్యమనుకుని నెల్లిమర్ల రైల్వేస్టేషన్ వరకు వెళ్లాడు. అక్కడ ఎందుకో ఓ క్షణం ఆగి మనస్సు చంపుకుని పోలీసులను ఆశ్రయిస్తే తన సమస్యకు పరిష్కారం చెబుతారని అనుకుని పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. చాతుర్య పరిస్థితిని గుర్తించిన సీఐ శ్రీనివాస్ రెండు రోజుల పాటు తనతో పాటు ఉంచి విద్యార్థి బాగోగులు చూసి కేసుల విషయంలో, పనివిషయంలో తమ సిబ్బంది చేస్తున్న, పడుతున్న కష్టాన్ని దగ్గరుండి చూసేలా చేశారు. చివరకు తాను చదువుకుంటానని, పరీక్షలో ఉత్తీర్ణుడినై కన్నవారి ఆశలను నెరవేరుస్తానని ఆ విద్యార్థి చెప్పడం విశేషం.
మిమ్స్ స్టూడెంట్‌కు కౌన్సెలింగ్ ఇచ్చాం
ఆన్‌లైన్ యాప్‌లకు ఏ ఒక్కరూ బలికావద్దని విజయనగరం టూటౌన్ సీఐ శ్రీనివాస్ స్పష్టం చేశారు. మిమ్స్ విద్యార్థి చాతుర్య క్యాష్యో యాప్ ద్వారా డబ్బులు కట్టి ఆపై అప్పులు చేసి రాబడి రాకపోవడంతో చావే శరణ్యమనుకుని పరిష్కారం చూపాలంటూ తన వద్దకు వచ్చాడన్నారు. రెండు రోజులపాటు తన సిబ్బందితోనే ఉంచి కౌన్సెలింగ్ ఇచ్చామని, ప్రస్తుతం పరీక్షలు రాసేందుకు సన్నద్ధంగా ఉన్నాడని సీఐ శ్రీనివాస్ చెప్పారు.


