విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరిగిన తైక్వాండో పోటీల్లో అతిథ్య విజయనగరం జట్టు ఓవరాల్ చాంపియన్ షిప్ దక్కించుకుంది. గడిచిన మూడు రోజులుగా జరిగిన పోటీల్లో 394 పాయింట్లు దక్కించుకున్న విజయనగరం క్రీడాకారులు ఈ ఘనత సాధించారు. 350 పాయింట్లు సాధించిన విశాఖ జట్టు రెండవ స్థానంలో నిలవగా..మూడవ స్థానాన్ని 259 పాయింట్లతో తూర్పుగోదావరి జట్టు దక్కించుకుంది. పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు తైక్వాండో అసోసియేషన్ ప్రతినిధులు బహుమతులు ప్రదానం చేశారు. దీంతో జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ నేతృత్వంలో జరిగిన 5వ ఏపీ కప్ స్టేట్ తైక్వాండో చాంపియన్‌షిప్–2026 పోటీలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 600 మంది క్రీడాకారులు పోటీ పడ్డారు. ముగింపు కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వేణుగోపాలరావు మాట్లాడుతూ యువ క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణను పెంపొందించడమే లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా క్రీడాకారులను తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చిం నాయుడు, కోశాధికారి నాయబ్ రసూల్, వివిధ జిల్లాల కార్యదర్శులు, కోచ్‌లు, క్రీడాకారుల తల్లిదండ్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
అథ్లెటిక్స్ పోటీల్లో పతకాలు
రాష్ట్రస్థాయిలో జరిగిన సీనియర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఈనెల 5, 6 తేదీల్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు ఉత్తమ క్రీడా ప్రతిభతో విద్యల నగరం విజయనగరం జిల్లా కీర్తి ప్రతిష్టలను చాటిచెప్పారు. పోటీల్లో 9 మంది క్రీడాకారులు పాల్గొనగా.. 7గురు క్రీడాకారులు పతకాలు కై వసం చేసుకోవడం విశేషం. షాట్‌పుట్‌లో జి.వెంకటనాయుడు, 400 మీటర్ల పరుగు పోటీలో పి.ప్రవీణ్‌కుమార్ బంగారు పతకాలు కై వసం చేసుకున్నారు. అంతేకాకుండా లాంగ్‌జంప్‌లో జి.లక్ష్మి స్విలర్, డెకాతలీన్‌లో కె.సాయితేజ సిల్వర్, పోల్‌వాల్ట్ విభాగంలో కె.సాయితేజ సిల్వర్ మెడల్స్ చేజిక్కించుకున్నారు. అలాగే జావెలిన్‌త్రోలో డి.ఉదయ్, 100 మీటర్ల పరుగు పోటీలో ఎ.దివ్యవాణిలు బ్రాంజ్ మెడల్స్ దక్కించుకున్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పి.లీలాకృష్ణ, ఎ.శ్రీకాంత్, ట్రెజరర్ వి.ఆనంద్ కిషోర్‌లు అభినందించారు.
తైక్వాండో ఓవరాల్ చాంపియన్
విజయనగరం
రెండవ స్థానంలో నిలిచిన విశాఖ
క్రీడాకారులు
మూడవ స్థానాన్ని దక్కించుకున్న
తూ.గో జట్టు
ముగిసిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలు


