● డీఈఓ మాణిక్యం నాయుడు చేతుల మీదుగా చెక్కుల పంపిణీ
విజయనగరం గంటస్తంభం: ప్రభ్వుత పాఠశాలల్లో చదివి పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా టాప్ టెన్ విద్యార్థులకు వీకే(వసుధైక కుటుంబం) ఫ్యామిలీ ఫౌండేషన్, క్రెడిట్ బీ సంయుక్త ఆధ్వర్యంలో నగదు ప్రోత్సాహక చెక్కులు పంపిణీ చేశారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో డీఈఓ యు.మాణిక్యం నాయుడు విద్యార్ధులకు చెక్కులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాణిక్యంనాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. విజయనగరం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో విద్యార్థులకు సైకిళ్లు, స్కాలర్‌షిప్‌లు అందించడంతో పాటు టాప్ టెన్ విద్యార్థులకు నగదు బహుమతులు ఇవ్వడం మంచి కార్యక్రమమన్నారు. 594 మార్కులతో ప్రథమ స్థానం సాధించిన ఇ.ఉమాపార్వతి, జి.సాద్వికలకు రూ.14 వేలు చొప్పున, 593 మార్కులతో ద్వితీయ స్ధానం పొందిన ఎస్.గుణశేఖర్, జె.పవన్‌కుమార్‌లకు రూ.10 వేలు చొప్పున, 591 మార్కులతో తృతీయ స్థానం సాధించిన కె.కీర్తనకు రూ.7వేలు నగదు బహుమతులు అందజేశారు. అలాగే 590 మార్కులు సాధించిన మరో ఏడుగురు విద్యార్థులకు రూ.3 వేలు చొప్పున చెక్కులు అందించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ మోహనరావు, వెంకటరమణ, డీసీఈబీ కార్యదర్శి టి.సన్యాసిరాజు, ట్రస్ట్ ప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


