● అంగన్వాడీ కేంద్రం వద్ద తాగి
విడిచిపెట్టిన అవశేషాలు
గంట్యాడ: మాంసం తిన్నానని అందరికీ తెలియాలని వెనకటికొకడు బొమికెలు మెడలో వేసుకుని తిరిగాడన్నట్లుంది కొందరు తాగుబోతుల నిర్వాకం. మండలంలోని నరవ గ్రామంలో అంగన్వాడీ–2 కేంద్రం వద్ద తాగుబోతుల చేసిన నిర్వాకం చిన్నారులు, అంగన్వాడీ సిబ్బందిలో ఆందోళన కలిగిస్తోంది. బుధవారం రాత్రి సమయంలో కొంతమంది అసాంఘిక వ్యక్తులు అంగన్వాడీ కేంద్రం వద్ద మద్యం తాగి, ఖాళీ సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులు అక్కడే పడేయడంతో గురువారం ఉదయం స్కూల్‌కు వచ్చిన చిన్నారులు భయాందోళనకు గురవుతున్నారు. చిన్నపిల్లలు చదువుకునే ప్రదేశమని తెలిసినా నిర్లక్ష్యంగా మద్యం తాగడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం పరిసరాల్లో పగిలిన సీసాలు, మద్యం అవశేషాలు ఉండడంతో పిల్లలకు ప్రమాదం పొంచి ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా స్థానిక పోలీసులు, సంబంధిత అధికారులు స్పందించి అంగన్వాడీ కేంద్రం వద్ద అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చిన్నారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.


