విజయనగరం టౌన్: స్థానిక పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో ఈ నెల 12న మంగళవారం నిర్వహించనున్న హనుమాన్ జయంతి వేడుకలకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు మడిపల్లి వెంకటాచలం పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక ఆలయం ఆవరణలో గురువారం నిర్వహించిన సమావేశంలో కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయం నిర్మించి 18 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఐదు రోజుల పాటు ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకూ వేడుకలు ఉంటాయన్నారు. ప్రాజెక్ట్ చైర్మన్ గ్రంధి గుప్తా మాట్లాడుతూ 12వ తేదీ ఉదయం 5 గంటల నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, 108సార్లు మన్యసూక్తం పారాయణం, లక్ష తమలపాకులతో అభిషేకాలు చేస్తామన్నారు. గోకవరపు ఉదయ్ మాట్లాడుతూ ఆ రోజు సాయంత్రం 5 గంటలకు చిన్నారులతో సిందూరార్చన, 27 రకాల పిండివంటల నివేదన, అనంతరం ప్రసాద వితరణ ఉంటుందన్నారు. దేవాలయం కన్వీనర్ పెంటపాటి కామరాజు మాట్లాడుతూ దేవాలయం గౌరవాధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి సలహా, సూచనలతో ఆ రోజు మధాహ్నం ఐదువేల మందికి మహాఅన్నప్రసాద వితరణ చేపడతామన్నారు. కార్యక్రమంలో పెంటపాటి ముత్యాలు, బాబ్జీ, బ్రహ్మనాథం తదితరులు పాల్గొన్నారు.


