సీతంపేట: పెళ్లి భోజనానికి ఆనందంగా వెళ్లారు. అక్కడ బంధువులను కలిశారు. వధూవరులను ఆశీర్వదించారు. మధ్యాహ్న భోజనం చేశాక తిరిగి వ్యాన్‌లో బయలుదేరారు. పెళ్లి ముచ్చట్లు చెప్పుకుంటూ ఘాట్ రోడ్‌లో ముందుకు సాగుతున్నారు. అంతే... ఒకేఒక్క కుదుపు.. కళ్లుమూసి తెరిచేలోగా వారు ప్రయాణించిన వ్యాన్ లోయలోకి బోల్తాకొట్టింది. ఆ ప్రాంతమంతా హాహాకారాలతో నిండిపోయింది. అంతలోనే వ్యాన్ ఓ చెట్టుకు తగలి నిలవడంతో ఊపిరితీసుకున్నారు. ఒక్కొక్కరుగా వ్యాన్ నుంచి బయటపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. సీతంపేట ఏజెన్సీలోని ఘాట్ రోడ్‌లో బుధవారం జరిగిన ప్రమాదంలో 18 మంది గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం...
సీతంపేట మండలం పూతికవలస పంచాయతీ పరిధిలో బెన్నడుగూడ గ్రామానికి చెందిన గిరిజనులు 42 మంది పుట్టిగాం గ్రామంలో జరిగిన వివాహానికి బొలెరో మినీ పికప్ వ్యాన్‌పై వెళ్లారు. మధ్యాహ్నం భోజనం అనంతరం తిరుగు ప్రయాణంలో వస్తుండగా సలబం పాడు గ్రామ సమీపంలో అదుపుతప్పి పల్టీ కొట్టింది. వ్యాన్‌లో ఉన్నవారు చెల్లాచెదురుగా పడిపోయారు. వ్యాన్‌ను చెట్టు అడ్డుకోవడంతో అందులో ఉన్న మిగిలిన వారు ప్రాణాలతో బయటపడ్డారు. చెట్టు అడ్డుకోకుంటే పెద్ద ప్రమాదమే జరిగేది. ప్రమాదంలో 18 మంది గాయపడ్డారు. కూరంగి మంపి, సవర సురభి, బిడ్డిక ప్రకాష్, సవర శ్రావణ్‌కుమార్, బి.కీర్తి, కె.సంజన, ఎస్.సింగన్న, నందిని, సవర నరేష్, సవర గుడిమి, సవర గంగమ్మ, సవర బూగమ్మ, సవర తోటయ్య, సవర నీలమ్మ, గుడమి, ఎస్.పూలమై, ధమయంతి, సుభద్రలతో పాటు చిన్నచిన్న గాయాలపాలైన వారిని 108 అంబులెన్స్‌లో సీతంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆర్‌ఎంవో డి.వి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది సేవలు అందజేశారు. మెరుగైన వైద్యసేవలు అవసరమైన 8 మందిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. పాలకొండ సీఐ ప్రసాదరావు, ఎస్‌ఐ వై.అమ్మన్నరావు ఘటనా స్థలాన్ని సందర్శించారు. వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లి భోజనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం
అదుపుతప్పి లోయలోకి బోల్తాకొట్టిన వ్యాన్
చెట్టు అడ్డకోవడంతో తప్పిన ప్రాణముప్పు
18 మందికి గాయాలు
మెరుగైన వైద్యం కోసం 8 మందిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలింపు


