సాక్షి, పార్వతీపురం మన్యం: సీతానగరం మండలం నిడగల్లులో ఉన్న చిన్ని సామిల్లును అధికారులు బుధవారం సీజ్ చేశారు. పార్వతీపురం మండలం అడారు ఎంపీపీ పాఠశాల ఆవరణలో ఉన్న టేకు చెట్లను టీడీపీ నాయకులు అక్రమంగా నరికేసి, రాత్రికి రాత్రి తరలించిన విషయం విదితమే. దీని మీద పోలీస్ కేసు కూడా నమోదైంది. ఈ టేకు దుంగలు సీతానగరం మండలం నిడగల్లు వద్ద ఉన్న సామిల్లులో ప్రత్యక్షమయ్యాయి. దీనిపై ఈ నెల 5న ‘కలపకూ కాళ్లున్నాయ్.. ఆడారు నడిచెళ్లాయ్’ అనే శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన అటవీ శాఖాధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కోత పూర్తయిన కొన్ని దుంగలను గుర్తించి సీజ్ చేశారు. అక్రమాలకు సహకరించిన మిల్లును కూడా సీజ్ చేసినట్లు జిల్లా అటవీ శాఖాధికారిణి ప్రసూన తెలిపారు.


