తమ్ముడు తమ్ముడే.. బేరం బేరమే..! | - | Sakshi
Sakshi News home page

తమ్ముడు తమ్ముడే.. బేరం బేరమే..!

May 7 2026 9:14 AM | Updated on May 7 2026 9:14 AM

తమ్ముడు తమ్ముడే.. బేరం బేరమే..!

ఆ నేత రూటే సెప‘రేటు’

పార్టీ కార్యకర్తలకే ఝలక్‌

ఎక్కువ డబ్బులు ఇచ్చినవారికే పోస్టులు

సాక్షి, పార్వతీపురం మన్యం:

అందివచ్చిన అవకాశాన్ని టీడీపీ నాయకులు రెండు చేతులా వినియోగించుకుంటున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు. మరోసారి పదవి ఉంటుందో ఉండదో అన్నట్లుగా ప్రతీ పనికి రేటు కట్టి అందిన కాడికి దోచుకుంటున్నారని అధికార పార్టీ కార్యకర్తలే బహిరంగంగా చెబుతుండడం, పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదులు చేస్తుండడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ప్రజాప్రతినిధుల పాలనను ఎత్తిచూపుతోంది. ప్రభుత్వ భూములు, చెరువులు, కలప, ఇసుక, మైనింగ్‌, ఉద్యోగాలు.. ఇలా అన్నిట్లోనూ నేతలు తల దూర్చుతున్నారు. ఈ విషయంలో తరతమభేదాలు ఉండడం లేదు. తమ సొంత పార్టీ కార్యకర్తలైనా.. తమ విజయం కోసం అహర్నిశలూ శ్రమించిన వారైనా సరే.. క్షమించడం లేదు. సాధారణంగా తమ ప్రభుత్వం అధికారంలో ఉంటే.. ఏదైనా పనులు చేయించుకోవచ్చని చోటా నాయకులు, కార్యకర్తలు ఆశ పడటం సహజం. వారి ఆశలకు కూడా విలువ కట్టేస్తున్నారు నేతలు!! దీంతో తమ్ముళ్లు లబోదిబో అంటున్నారు. ఇలాంటి వారి కోసమా చెమటలు చిందించాం అని వాపోతున్నారు.

ఆ నేత ఒక ఆకు ఎక్కువే..

రాకరాక వచ్చిన అవకాశం కావడంతో ఓ నియోజక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధి చెలరేగిపోతున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు, కంప్యూటర్‌ అపరేటర్లు.. ఇలా పోస్టుకు ఒక రేటు కట్టేశారు. సొంత పార్టీ కార్యకర్తల సమక్షంలోనే ‘విజయ’వంతంగా వేలంపాట పెట్టేస్తున్నారు. ముందు ఒక రేటు ఖరారు అయినా ఆ పోస్టు తమకే దక్కుతుందన్న నమ్మకం కార్యకర్తలకు ఉండడం లేదు. అంతకంటే ఎక్కువ ధర ఎంకెవరైనా ఇస్తే ఇచ్చిన హామీ కాస్త అటకెక్కుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement