సమన్వయంతో లక్ష్యాలు సాధించాలి | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతో లక్ష్యాలు సాధించాలి

May 7 2026 9:14 AM | Updated on May 7 2026 9:14 AM

ఐటీడీఏ పీఓ వైశాలి

పార్వతీపురం: గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను సకాలంలో సాధించాలని ఐటీడీఏ పీఓ ఆర్‌.వైశాలి సూచించారు. తన చాంబర్‌లో అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ గిరిజన రైతులకు విత్తనాలు, ఎరువులు, పరికరాలు ఆలస్యం లేకుండా అందించాలన్నారు. యూనిట్ల గ్రౌండింగ్‌ వేగవంతం చేసి లబ్ధిదారులకు అవసరమైన సహయం త్వరగా అందించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

నందివానివలసలో ఏనుగుల గుంపు

గరుగుబిల్లి: మండలంలోని నందివానివలస గ్రామ పరిసరాల్లో ఏనుగుల గుంపు బుధవారం సంచరించింది. రెండువారాల నుంచి గిజబ, తోటపల్లి, నాగూరు, మరుపెంట, సుంకి, నందివానివలస తదితర గ్రామాల పరిధిలో ఏనుగులు సంచరిస్తున్నాయి. పంటలను నాశనం చేస్తున్నాయి. ప్రధాన రహదారికి ఆనుకొని సంచరిస్తుండడంతో ప్రజలు రాకపోకలు సాగించేందుకు భయపడుతున్నారు. ఏనుగులను ఈ ప్రాంతం నుంచి తరలించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం

పార్వతీపురం: ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నట్టు కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి తెలిపారు. ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు జూనియర్‌ కళాశాలల్లో ప్రత్యే రెమిడియల్‌ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో జరుగుతున్న ఎన్యూమరేషన్‌ పనులను ఈ నెల 20లోగా పూర్తిచేయాలని అధికారులకు టెలికాన్ఫరెన్సులో కలెక్టర్‌ ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఎంఆర్‌ఐ స్కాన్‌ సాయంత్రం 6 గంటలకే క్లోజ్‌..!

విజయనగరం ఫోర్ట్‌: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని ఎంఆర్‌ఐస్కాన్‌ సాయంత్రం 6 గంటలకే క్లోజ్‌ చేస్తున్నారని, 6 గంటల తర్వాత ఎంఆర్‌ఐ స్కాన్‌ అవసరమైన వారు మరుసటి రోజు వరకు వేచిఉండాల్సి వస్తోందని రోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. విషయం అధికారులకు తెలిసినినా పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా స్కానింగ్‌ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉండాలి. ఎంఆర్‌ఐ స్కాన్‌ నిర్వహణ బాధ్యతలను ఎన్‌ఆర్‌ఐ సంస్థ సరిగా నిర్వహించడంలేదని రోగులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ అల్లు పద్మజ వద్ద ప్రస్తావించగా ఎంఆర్‌ఐ స్కాన్‌ 24 గంటల పాటు అందుబాటులో ఉండాలని, ఆ మేరకు ఎన్‌ఆర్‌ఐ సంస్థతో ఎంఓయూ కుదిరిందన్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత స్కాన్‌ తీయని విషయం నా దృష్టికి రాలేదని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement