
బాణసంచా విక్రయాలపై కఠిన చర్యలు
విజయనగరం అర్బన్: జిల్లాలో అనుమతి లేకుండా బాణసంచా విక్రయాలు లేదా తయారీ జరుగుతున్న చోట కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్.రామ్‌సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామస్థాయిలో కూడా తనిఖీలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో గురువారం జరిగిన సమీక్షా సమావేశంలో జిల్లా వ్యాప్తంగా బాణసంచా విక్రయాలు, తయారీ పరిస్థితులపై పోలీస్, అగ్నిమాపక, రెవెన్యూ విభాగాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లలో మొత్తం ముగ్గురు తయారీదారులు, 15 మంది హోల్‌సేల్ విక్రేతలు ఉన్నారని తెలియజేశారు. ఆర్డీఓలు డి.కీర్తి, మోహనరావు, ఆశయ్య తమ పరిధిలో జరుగుతున్న విక్రయాలపై వివరాలు సమర్పించారు.కలెక్టర్ రామ్‌సుందర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, బాణసంచా విక్రయం ఏ స్థాయిలోనైనా నిర్వహించాలంటే అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. హోల్‌సేల్ షాపులపై పోలీస్, ఫైర్, రెవెన్యూ అధికారులు సంయుక్త తనిఖీలు చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో జరిగే విక్రయాలను వీఆర్‌ఓలు పర్యవేక్షించాలని సూచించారు. అనుమతి పొందిన విక్రేతలు భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి. అగ్నిప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. నీరు అందుబాటులో ఉంచాలి. ఫైర్ సిలిండర్ లభ్యతను నిర్ధారించాలని కలెక్టర్ చెప్పారు. తాత్కాలిక విక్రయాల ప్రాంతాల్లో ఫైర్ ఇంజిన్ వెళ్ళేందుకు తగిన ఖాళీ ఉంచాలని, టెంట్లకు బదులు రేకులతో షెడ్లు నిర్మించాలని సూచించారు. విక్రేతలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వారికి నిబంధనలు, భద్రతా మార్గదర్శకాలు వివరించాలని ఆర్డీఓలకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో జిల్లా అగ్నిమాపక అధికారి రాంప్రసాద్, డీఎస్పీ వీర్‌కుమార్, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.