
తండ్రిని చంపిన తనయుడు
బాడంగి: వ్యసనాలకు బానిసైన కొడుకు మద్యం కోసం డబ్బు లివ్వలేదని కన్నతండ్రినే హతమార్చాడు. బాడంగిలో జరిగిన ఈ విషాదకర సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలకేంద్రంలోని సినిమా కాలనీలో నివాసముంటున్న బలిజిపేటకు చెందిన బోనుగిరి రాజేశ్వరరావు(70)ను చిన్నకుమారుడు లక్ష్మణరావు చెప్పులు కుట్టుకునే గూటంతో కొట్టి హతమార్చాడు. మద్యం కొనుగోలుకోసం డబ్బులిమ్మని అడగ్గా తండ్రీకొడుకుల మధ్య బుధవారం రాత్రి జరిగిన ఘర్షణలో ఆవేశపరుడైన కుమారుడు చెప్పులు కుట్టే గూటంతో తండ్రి చెవిపైన బలంగా కొట్టగా తండ్రి రాజేశ్వర రావు స్పృహకోల్పోయి అక్కడికక్కడే కుప్పకూలాడు. గురువారం తెల్లవారుజామువరకు ఈవిషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడి సాధారణ మరణంగా నమ్మబలికే ప్రయత్నం చేశారు. కుమారుడే కాలయముడన్న విషయం చుట్టుపక్కల వారికి తెలిసిపోవడంతో చేసేదిలేక హతుడి భార్య ఉమ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతుడికి ముగ్గురు పిల్లలు కాగా పెద్దకుమారుడు గతంలో రైలు ప్రమాదంలో చనిపోగా కుమార్తెకు వివాహంచేసి అత్తవారింటికి పంపారు. చిన్నకుమారుడు లక్ష్మణరావు సిమెంట్‌పని, పెయింటింగ్ వర్క్ చేసుకుంటూ వ్యసనాలకు బానిసగా మారి తరచూ తల్లిదండ్రులతో తగాదాలు పడుతుంటాడని ఇరుగుపొరుగు వారి సమాచారం మేరకు తెలిసింది. హత్య సంఘటనపై సమాచారం అందుకున్న బొబ్బిలి రూరల్ సీఐ నారాయణ రావు, ఎస్సై తారకేశ్వరరావు, డీఎఎస్పీ భవ్యరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హతుడి భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేయగా, సీఐ దర్యాప్తు చేస్తున్నారు.

తండ్రిని చంపిన తనయుడు