గరుగుబిల్లి: చెరువులో స్నానానికి దిగిన ఓ పూజారి ప్రమాదవశాత్తు మృతిచెందాడు. గరుగుబిల్లి మండలంలో గురువారం జరిగిన సంఘటనపై స్థానిక ఎస్సై ఫకృద్ధీన్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రావుపల్లిలో బుధవారం రాత్రి గ్రామానికి చెందిన తెలగవీధిలోని రామమందిరం ఆలయ పూజారిగా పనిచేస్తున్న సంగం చంద్రశేఖర్ (53) స్నానానికి బోటువాని చెరువులో దిగుతున్న సందర్భంలో ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి మునిగిపోయాడు. ఆ సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో నీటిలో మునిగి చనిపోయాడు. కొద్ది సమయం తరువాత చెరువులో చంద్రశేఖర్ మునిగిపోయినట్లు స్థానికులు గుర్తించి స్థానిక ఎస్సైకి సమాచారం అందించడంతో ఆయన సిబ్బందితో వచ్చి మృతదేహం కోసం స్థానికుల సహయంతో గాలింపు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు గ్రామంలో సర్పంచ్ బొంతాడ మహేశ్వరరరావు సమక్షంలో శవ పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికిచ మృతదేహాన్ని తరలించారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆలయ పూజారి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
వేపాడ: మండలంలోని బానాది గ్రామానికి చెందిన సంపర్తి ఆంజనేయులు (32) కోనేరులో జారిపడి గురువారం మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి వల్లంపూడి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సంపర్తి ఆంజనేయులు తల్లి ఎర్రయ్యమ్మచెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లింది. బట్టలు మూటకడుతుండగా మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఆంజనేయులు కాలుజారి కోనేరులో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు మృతుడి తల్లి ఎర్రయ్యమ్మ ఫిర్యాదుపై వల్లంపూడి హెచ్‌సీ శివకేశవరావు కేసు నమోదుచేసి మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం ఎస్.కోట ఆస్పత్రికి తరలించారు.
చెరువులో పడి పూజారి మృతి