
ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్
విజయనగరం ఫోర్ట్: ఖరీఫ్‌కుగాను 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించామని, పంట కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లుతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ధాన్యం సేకరణపై గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల స్థాయి, గ్రామ స్థాయి కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. పంట రకం, దిగుబడి వచ్చే సమయం, సేకరణపై మండల స్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. రైతు సేవా కేంద్రాల్లో సిబ్బందికి శిక్షణ పూర్తి చేయాలన్నారు. మద్దతు ధర, ట్రక్ షీట్ విధానం తదితర అంశాలపై విసృత్తంగా ప్రచారం చేయాలని సూచించారు. పౌర సరఫరా అధికారి మిల్లులను ట్యాగ్ చేయడం, బ్యాంకు గ్యారంటీను తీసుకోవడం, అన్ని మిల్లుల పని చేస్తున్నదీ.. లేనిదీ.. తనిఖీ చేయడం, సీఎస్‌డీటీలకు శిక్షణ పూర్తి చేయాలని పేర్కొన్నారు. ధాన్యం సేకరణకు అవసరమైన సామగ్రిని సరఫరా చేయాలన్నారు. వర్షాలు పడితే టార్పాలిన్లు సరఫరా చేయడానికి మండల కేంద్రాల్లో సిద్ధం చేయాలని మార్కెటింగ్ ఏడీ రవికిరణ్‌కు సూచించారు. పీఏసీఎస్‌ల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడానికి 57 సోసైటీలు సిద్ధంగా ఉన్నాయని వాటికి శిక్షణ పూర్తి చేయాలన్నారు. సమావేశంలో పౌర సరఫరాల జిల్లా మేనేజర్ బొడ్డేపల్లి శాంతి, ఆర్‌డీవోలు కీర్తీ, రాంమోహన్, జిల్లా వ్యవసాయ అఽధికారి, జిల్లా సహకార అధికారి రమేష్ పాల్గొన్నారు.