
రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి
కురుపాం:
సామాజిక ఆరోగ్య కేంద్రానికి వస్తున్న రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి సూచించారు. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తనిఖీలకు వచ్చిన రోగులతో ఆసుపత్రి రద్దీగా ఉండగా కలెక్టర్ అందుతున్న సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. రక్త పరీక్షల కోసం రోగులు బారులు తీరడంతో ఇకపై రోగుల సౌకర్యార్ధం ఆసుపత్రి బయట ఆవరణలో రక్త పరీక్షలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. అక్కడ చికిత్స పొందుతున్న గురుకులం, ఏకలవ్య పాఠశాలల విద్యార్థులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడారు. విధి నిర్వహణపై ఆరా తీశారు. ఎంపీడీవో ఉమామహేశ్వరితో మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అలాగే మృతి చెందిన కురుపాం గురుకుల విద్యార్థిని తోయక కల్పన స్వగ్రామమైన దండుసూర గ్రామాన్ని సందర్శించారు. అక్కడ పారిశుధ్య పనులు, వైద్య శిబిరాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట డీఎంహెచ్‌వో భాస్కరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
మలేరియా నివారణకు చర్యలు
పార్వతీపురం రూరల్: జిల్లాలో మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పటిష్టమైన నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మలేరియా ప్రభావిత గ్రామాలను గుర్తించి, యాంటీ లార్వా పిచికారీ చేయాలన్నారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, రాత్రి పూట దోమతెరల వాడకాన్ని ప్రోత్సహించాలని సూచించారు. అనుమానితులకు రక్త పరీక్షలు చేసి, పాజిటివ్ వస్తే వెంటనే మందులు అందించాలని స్పష్టం చేశారు. సమావేశంలో జేసీ యశ్వంత్‌కుమార్ రెడ్డి, డీఆర్‌వో హేమలత, డీఎంహెచ్‌వో భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.